తెలంగాణ

telangana

ETV Bharat / city

'నాడు-నేడు పనుల కోసం మరో రూ.2 వేలకోట్లు ఇవ్వండి'

ఆంధ్రప్రదేశ్​లో నాడు-నేడు పనుల కోసం మరో 2 వేలకోట్లు ఇవ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నాబార్డును కోరింది. పలు విభాగాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలను నాబార్డు ఛైర్మన్​కు తెలిపిన అధికారులు తగిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. నాబార్డు నిధులతో చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఆ రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులను మెచ్చుకున్న నాబార్డ్ ఛైర్మన్ తన తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు.

cm-jagan-review-on-nabard
'నాడు-నేడు పనుల కోసం మరో రూ.2 వేలకోట్లు ఇవ్వండి'

By

Published : Mar 18, 2021, 11:04 PM IST

నాబార్డు ఆర్థిక సహాయంతో జరుగుతున్న కార్యక్రమాలపై ఏపీ సీఎం జగన్, నాబార్డ్ ఛైర్మన్ చింతల గోవిందరాజులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కింద జరుగుతున్న పనులను నాబార్డు ఛైర్మన్‌కు విద్యాశాఖ అధికారులు వివరించారు. పాఠశాలల్లో కల్పించిన 10 రకాల సదుపాయాలను వివరించారు. తొలివిడతలో ఆంధ్రప్రదేశ్​లో నాడు-నేడు కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నాబార్డు 652 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. మిగిలిన వాటిల్లోనూ మరో 2 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా నాబార్డు ఛైర్మన్‌ను విద్యాశాఖ అధికారులు కోరారు. వైఎస్సార్​ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ పేరుతో అంగన్‌వాడీల్లో చేపడుతున్న కార్యక్రమాలను నాబార్డు ఛైర్మన్‌కు వివరించిన అధికారులు.. ప్రజారోగ్య రంగంలో చేపడుతున్న పనులను, వివరాలను అందించారు. కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలను, సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తున్నామని..,తగిన విధంగా రుణ సహాయం అందించాలని కోరారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని.. ఆర్బీకేలు, మల్టీపర్సస్‌ సెంటర్లు, ఫుడ్‌ప్రాసెసింగ్‌ విధానాలు, జనతా బజార్లను తీసుకొస్తున్నామని వ్యవసాయ శాఖ అధికారులు నాబార్డ్ ఛైర్మన్​కు వివరించారు. ప్రజలకు రక్షిత తాగునీటిని అందించడానికి చేపట్టిన వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు, సాగునీటి ప్రాజెక్టు వివరాలను అధికారులు తెలిపారు.

నవరత్నాల ముఖ్యమంత్రి

జగన్ నవరత్నాల ముఖ్యమంత్రి అని నాబార్డ్ ఛైర్మన్ చింతల ప్రశంసించారు. కీలక రంగాల్లో మార్పులు తీసుకురావాలని సీఎం తపనతో ఉన్నారన్న ఆయన.. వచ్చే 15 ఏళ్లలో ఏపీ రాష్ట్రం పూర్తిగా మారబోతోందన్నారు. మంచి చదువు, మంచి ఆరోగ్యం ప్రజలకు అందుతాయన్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై తాము చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. ఏపీ రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులు బాగున్నాయని.. వీటిపై పరిశీలన చేసి అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చాలా ముఖ్యమైన రంగమన్న ఆయన.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రంగంలో మేం ఏరకంగా సహాయపడగలమో ఆలోచనలు చేస్తామన్నారు. తాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.

ఇదీ చదవండి :'అంకెలు బారెడు... అప్పులు బోలెడు'

ABOUT THE AUTHOR

...view details