గృహ నిర్మాణశాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి , రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పేదలందరికీ ఇళ్ల పంపిణీ కోసం రూ.23 వేల 535 కోట్ల విలువైన 68,361 ఎకరాల సేకరించామన్నారు. రాష్ట్రంలో ఈ నెల 25న మొత్తం 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. వచ్చే మూడేళ్లలో 28.3 లక్షల ఇళ్లు నిర్మించాలన్న సీఎం.. ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. పట్టాలు ఇచ్చిన ప్రాంతాల్లో డిసెంబర్ 25న 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలని నిర్ణయించారు. ప్రతి నియోజకవర్గానికి 8,914 ఇళ్ల చొప్పున పనులు ప్రారంభించాలని ఆదేశించారు. 8,838 కొత్త లే అవుట్లలో 11.26 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు.
లబ్ధిదారులకు లేఖలు
రెండో దశలో 12.7 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. టిడ్కో ఇళ్లలో 365, 430 చదరపు అడుగుల ఫ్లాట్లపై ప్రకటించిన తాజా రాయితీలు వర్తింపజేయడం ద్వారా ప్రభుత్వం అదనంగా రూ.482 కోట్ల ఖర్చును భరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 300 చదరపు అడుగుల ఫ్లాట్‌లను కేవలం 1 రూపాయికే ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. 3,65,987 ఇళ్లస్థలాలపై కోర్టు కేసులు ఉన్నాయన్న సీఎం... కోర్టు కేసులతో ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోతున్న ప్రాంతాల్లో లబ్ధిదారులకు లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. కేసులు పరిష్కారం కాగానే పట్టా ఇస్తామంటూ లబ్ధిదారులకు లేఖలు ఇవ్వాలన్నారు. కోర్టు కేసులు వీలైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు సీఎం ఆదేశించారు. న్యాయస్థానాల ముందు తగిన వివరాలు ఉంచాలని సూచించారు. లబ్ధిదారులు ఎలా కావాలంటే.. అలా ఇళ్లు కట్టించి ఇస్తామన్న సీఎం... వారికి 3 ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. లబ్ధిదారులు ఇళ్లు కట్టించి ఇవ్వమంటే.. ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. మెటీరియల్, లేబర్ కాంపొనెంట్‌కు సంబంధించి డబ్బు ఇవ్వాలంటే ఇస్తామన్నారు. లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకుంటామని పూర్తిగా డబ్బులు ఇవ్వాలంటే ఆలాగే ఇస్తామన్నారు.