కొవిడ్ నివారణ, కరోనా వాక్సినేషన్‌పై ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 104 కాల్ సెంటర్‌పై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని, రోగి ఫోన్ చేసిన 3 గంటల్లోగా ఆస్పత్రిలో బెడ్ సమకూర్చాలని స్పష్టం చేశారు. అవగాహన పెంచేలా.. అవసరమైన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లను బస్టాండ్ వంటి జన సమ్మర్థ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వాళ్లు కచ్చితంగా ఇళ్లలోనే ఉండేలా, నిరంతరం పర్యవేక్షించాలని.. ఈ ప్రక్రియకు తగిన ప్రొటోకాల్ రూపొందించాలని చెప్పారు. రోగులకు కొవిడ్ కిట్ తప్పనిసరిగా అందించాలన్నారు.
"ఆస్పత్రుల్లో ఆక్సీజన్ సరఫరా పూర్తి స్థాయిలో ఉండాలి. విశాఖలోని ప్రొడక్షన్ సెంటర్ నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకోవాలి. కొవిడ్ పరీక్ష మొదలు వైద్యం, మందులు, శానిటేషన్, ఆహారం వరకూ ఏ మాత్రం రాజీ పడొద్దు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరే రోగులకు అధిక చార్జీలు వసూలు చేయకుండా నిఘా పెట్టాలి. ఎక్కువ ధరలు వసూలు చేసే ఆస్పత్రులపై.. కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు ఎక్కడా బెడ్ల కొరత ఉండకూడదు. ఆరోగ్యశ్రీ జాబితాలోని ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలూ అధికారుల వద్ద ఉండాలి. ఆస్పత్రుల్లో చికిత్స ఫీజులు, ఛార్జీల వివరాలను రోగులకు అర్ధమయ్యేలా ప్రదర్శించాలి. రోగి దోపిడికి గురి కాకుండా ఔషధాలు, ట్యాబ్లెట్లు, ఇంజక్షన్ల రేట్లు స్పష్టంగా ప్రదర్శించాలి. నిర్దేశిత ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలన్నదీ బోర్డులో రాయాలి" అని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.