అన్ని ఆస్పత్రుల్లో ప్రమాణాలు పెంచాలని, మంచి గ్రేడింగ్ వచ్చేలా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. కరోనా నివారణ చర్యలు, ఆరోగ్యశ్రీపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష చేసిన సీఎం.. ఐవీఆర్ఎస్లో అడిగే ప్రశ్నల్లో మరింత స్పష్టత రావాలన్నారు. వైద్య సేవలు, శానిటేషన్‌పై ప్రజల నుంచి పూర్తి వివరాలు ఆరా తీయాలని, ఆ మేరకు ప్రశ్నలు మార్చాలని నిర్దేశించారు. హోం ఐసొలేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా కిట్లు ఇవ్వాలన్న సీఎం.. అధికారులు పక్కాగా పర్యవేక్షించాలని సూచించారు. అన్ని కొవిడ్ ఆస్పత్రులలో ప్లాస్మా థెరపీ నిర్వహించాలన్న ఆయన.. దాతలను ప్రోత్సహించేందుకు రూ.5 వేలు ఇవ్వాలని ఆదేశించారు.
పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
ఏపీలోలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో ఇప్పటివరకు 48 లక్షల 84 వేల 371 కొవిడ్ పరీక్షలు చేయగా, ఇప్పుడు 94వేల 453 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపారు. పాజిటివిటీ రేటు 12.31 శాతం కాగా, రికవరీ రేటు 84.48 శాతంగా ఉందని.. మరణాల రేటు కేవలం 0.86 శాతం మాత్రమే నమోదవుతోందని చెప్పారు. ఈనెల 16వ తేదీ నాటికి 11,01,625 శాంపిల్స్ సేకరించి పరీక్ష చేయగా..,1,56,323 కేసులు పాజిటివ్‌గా తేలాయని అధికారులు సీఎంకు వివరించారు. 17వ తేదీన ఒక్క రోజే 75 వేల పరీక్షలు చేశామని చెప్పారు. కొవిడ్ చికిత్స కోసం అన్ని జిల్లాలలో పూర్తి సదుపాయాలు ఉన్నాయని.., ఏ పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అన్ని ఆస్పత్రులలో మంజూరు చేసిన పోస్టులన్నీ వెంటనే భర్తీ అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో ఇప్పటికే హెల్ప్‌డెస్క్‌లు
ఏపీలోని 540 ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో ఇప్పటికే హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు కాగా.. మిగిలిన 27 ఆస్పత్రుల్లోనూ త్వరలో ఏర్పాటు చేస్తామని ఆరోగ్యశ్రీ అధికారులు జగన్‌కు వివరించారు. ఏపీలోని అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో వెంటనే ఆరోగ్యమిత్రలను ఏర్పాటు చేయాలని.. వారు ప్రధానంగా 6 బాధ్యతలు నిర్వర్తించాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రిలో వైద్య మౌలిక సదుపాయాలు, వైద్యుల అందుబాటు, ఆహారంలో నాణ్యత, శానిటేషన్, వైయస్సార్ ఆరోగ్య ఆసరా అందేలా చూడడం, పేషెంట్ కేరింగ్ లాంటి 6 అంశాలను ఆరోగ్యమిత్రలు చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో విలేజ్ క్లినిక్‌లు ఆరోగ్యశ్రీకి రెఫరల్‌గా ఉంటాయన్నారు. ఆ తర్వాత కోవలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులు రెఫరల్‌గా ఉంటాయని తెలిపారు. ఆరోగ్యమిత్రకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆస్పత్రి బయట, లోపల తప్పనిసరిగా ప్రదర్శించాలని, రెండు వారాల్లోగా అన్ని ఆస్పత్రులలో వారి నియామకాలు పూర్తి కావాలని నిర్దేశించారు.