సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. డీసీసీబీ సమర్థత పెరగాలని, మంచి యాజమాన్య పద్ధతులు రావాలని అభిప్రాయపడ్డారు. సహకార రంగం పునర్‌వ్యవస్థీకరణ, డీసీసీబీలు, పీఏసీఎస్‌ల పనితీరుపై అధికారులతో సీఎం సమీక్షించారు. కడప, కర్నూలు, అనంతపురం, ఏలూరు డీసీసీబీలు నిర్వీర్య దశలో ఉన్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. ఆయా చోట్ల ధ్రువపత్రాలూ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. 45 శాతం పీఏసీఎస్‌లు పూర్తిగా నష్టాల్లో ఉన్నాయని వెల్లడించారు. 49 శాతం మండలాలకు డీసీసీబీ బ్రాంచ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం లేదని వివరించారు. డీసీసీబీల సమర్థ నిర్వహణకు సిఫారసులపై సమావేశంలో చర్చించారు. ఆప్కాబ్, డీసీసీబీల నుంచి పీఏసీఎస్‌ల వరకు కంప్యూటరీకరణ చేయాలని సీఎం సూచించారు. పీఏసీఎస్‌లు నాన్ క్రెడిట్ సేవలూ అందించాలని చెప్పారు.
'సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి'
పీఏసీఎస్(ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల) నెట్‌వర్క్‌ను మరింత పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రతి మూడు రైతు భరోసా కేంద్రాలకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. సహకార వ్యవస్థలు పూర్తి పారదర్శకంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పీఏసీఎస్ నివేదికల్లో తేడా వస్తే థర్డ్ పార్టీతో స్వతంత్ర విచారణ జరపాలని ఆదేశించారు.
'పీఏసీఎస్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలి. ప్రతి 3 ఆర్‌బీకేలకు ఒక పీఏసీఎస్ ఉండేలా చూడాలి. ఆప్కాబ్, డీసీసీబీ బోర్డుల్లో నిపుణులను నియమించాలని ప్రతిపాదనపై దృష్టిసారించాలి. సాగు, బ్యాంకింగ్, ఆర్థిక, అకౌంటెన్సీలో నిపుణులను తేవాలి. బోర్డుల్లో మూడింట ఒకవంతును డైరెక్టర్లుగా నియమించాలి. పీఏసీఎస్‌ల్లో క్రమం తప్పకుండా నిపుణులతో ఆడిటింగ్ చేపట్టారు. నివేదికల్లో తేడా వస్తే థర్డ్‌పార్టీతో స్వతంత్ర విచారణ జరపాలి. సహకార వ్యవస్థలు పారదర్శకంగా ఉండాలి.' - ఏపీ సీఎం జగన్
సాగు అనుబంధ రంగాల్లోని మల్టీపర్పస్ సెంటర్లతో పాటు పాలవెల్లువ కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించారు. గిడ్డంగులు ఏడాదిలో పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ చర్యల వల్ల పాడి రైతులకు మంచి రేటు వస్తోందన్న ఆయన... పాలవెల్లువ ప్రాజెక్టును మిగతా జిల్లాలకూ విస్తరిస్తున్నామని వెల్లడించారు.