వర్షాలు తగ్గాక ముందుగా రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలపై సమీక్షించిన ఆయన.. పలు కీలక సూచనలు చేశారు. అక్టోబరు నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయని.. ముందుగా రోడ్ల మరమ్మతులపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటినీ బాగు చేయాలన్నారు.
వర్షాల వల్ల రహదారులు బాగా దెబ్బతిన్నాయని జగన్ పేర్కొన్నారు. రోడ్ల బాగు కోసం ప్రభుత్వం నిధి ఏర్పాటు చేసిందని వెల్లడించారు. రోడ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే చాలా వరకు టెండర్లు పిలిచారని.. ఎక్కడైనా ఇంకా పిలవకపోతే వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. అక్టోబరులో రోడ్ల పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా రోడ్ల పనులు చేయాలన్న ముఖ్యమంత్రి.. సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలిసి కార్యాచరణ వేసుకోవాలని దిశానిర్దేశం చేశారు.