వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి (ysr Kapu Nestam scheme) సంబంధించి రెండో ఏడాది నిధులు.. ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ. 15 వేల చొప్పున జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఆర్థిక సాయం అందింది. ఒక్క రూపాయి అవినీతి లేకుండా, వివక్ష లేకుండా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ప్రతి లబ్దిదారుడికీ మంచి జరగాలని లక్ష్యంగా పెట్టుకుని పథకాలు అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
'ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల చొప్పున లబ్ధిదారులకు ఆర్థికసాయం అందిస్తాం. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాన్ని అమలు చేస్తున్నాం. మహిళా స్వావలంబన అనే గొప్ప ఆలోచన నుంచి పుట్టిన కార్యక్రమం వైఎస్ఆర్ కాపు నేస్తం. మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పాత బకాయిలకు కాపు నేస్తం నగదు జమ చేసుకోకూడదని బ్యాంకులను ఆదేశించాం. రెండేళ్లలో కాపునేస్తం ద్వారా రూ.982 కోట్లు జమ చేశాం.'- ఏపీ సీఎం జగన్