తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2020, 10:51 PM IST

ETV Bharat / city

వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతికి ఆంగ్ల మాధ్యమం: జగన్

విద్యా సంస్థల్లో నాడు-నేడు రెండో విడత అభివృద్ధి పనులకు వచ్చే ఏప్రిల్​లో శ్రీకారం చుట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. నాడు-నేడులో అంగన్​వాడీ కేంద్రాల నిర్మాణాలూ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన కేర్ టేకర్లను నియమించాలన్నారు. వచ్చేవిద్యా సంవత్సరంలో ఏడో తరగతి విద్యార్థులకు ఆంగ్లమాద్యమం ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు.

వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతికి ఆంగ్ల మాధ్యమం: సీఎం
వచ్చే విద్యా సంవత్సరంలో ఏడో తరగతికి ఆంగ్ల మాధ్యమం: సీఎం

మన బడి నాడు-నేడు రెండో విడత పనులను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. 9,476 ప్రాథమిక, 822ప్రాథమికోన్నత పాఠశాలలు, 2,771 హైస్కూళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, 473 జూనియర్‌ కళాశాలలు, 1,668 హాస్టళ్లలో పనులు చేపట్టాలన్నారు. 17 డైట్‌ కాలేజీలు, 672 ఎంఆర్‌సీఎస్‌, 446 భవిత కేంద్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం సూచించారు. మన బడి నాడు-నేడుపై విద్యా శాఖ అధికారులతో సీఎం సమీక్షించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, పాఠశాల విద్యాశాఖ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ, గృహ నిర్మాణ శాఖ, సర్వ శిక్షా అభియాన్‌ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాడు-నేడు కింద చేపట్టనున్న కార్యక్రమాలపైనా సీఎం సమీక్షించారు.

మార్చి 2021లో మొదటి దశ పనులు మొదలుపెట్టి, రెండున్నరేళ్లలో మొత్తం పనులు పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. మొదటి విడతలో 6,407 కొత్త అంగన్‌వాడీల నిర్మాణం, 4,171 అంగన్‌వాడీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. మొత్తం 27,438 కొత్త అంగన్‌వాడీ భవనాల నిర్మాణం చేయడం సహా 16,681 చోట్ల అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా సుమారు 5 వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీలను మార్చనున్నట్లు సీఎం తెలిపారు. ప్రీప్రైమరీ విద్యార్థుల కోసం రూపొందించిన పుస్తకాలను అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. పుస్తకాల నాణ్యత బాగుండాలని, పిల్లలకు జిజ్ఞాస పెంచేలా, బోధన కోసం ప్రత్యేక వీడియోలు రూపొందించాలని సీఎం సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. టాయిలెట్లను శుభ్రపరిచేందుకు కేర్‌ టేకర్‌కు సగటున 6 వేలు చెల్లించాలి. టాయిలెట్లను శుభ్రపరిచే సామగ్రితో కలుపుకొని ఒక్కో పాఠశాలకు రూ.6,250 నుంచి 8 వేల వరకు ఖర్చు అవుతుంది. వేయికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో నలుగురు కేర్‌ టేకర్ల నియమించాలి.

-జగన్మోహన్​రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి

వచ్చే ఏడాది ఇవ్వాల్సిన విద్యాకానుకపైనా సీఎం జగన్ సమీక్షించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజునే కిట్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూలు యూనిఫారమ్స్‌ సహా దేనిలోనూ.. నాణ్యత తగ్గకుండా చూడాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ఏడో తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు ఆంగ్ల మాద్యమం ప్రవేశపెడతామని సీఎం స్పష్టం చేశారు.


ఇదీ చదవండి:అనిశా అభియోగాల్లో ఎలాంటి నిజం లేదు: రేవంత్​

ABOUT THE AUTHOR

...view details