కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గురువారం రాత్రి జారీ చేసిన నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్ కొన్ని మార్పులు కోరుకుంటోంది. ప్రధానంగా ఆ రాష్ట్రంలోని అనేక అంతర్గత ప్రాజెక్టులను, కాలువలనూ బోర్డుల పరిధిలోకి తీసుకొచ్చారని, అవన్నీ బోర్డు పరిధిలో అవసరం లేదని అభిప్రాయపడుతోంది. తాజా నోటిఫికేషన్‌పై జగన్ శుక్రవారం జలవనరులశాఖ, సీఎంవో అధికారులతో చర్చించారు. అధికారుల అభిప్రాయాలూ తెలుసుకున్నారు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం ఉమ్మడి ఏపీకి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆ రాష్ట్రానికి దక్కే 512 టీఎంసీల వాటా హక్కులు కాపాడేలా బోర్డు జోక్యం ఉండాలనే అభిప్రాయాన్ని జగన్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ నీటిని మనం ఎక్కడ ఎలా మన అవసరాల మేరకు వినియోగించుకున్నా బోర్డు నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాని రీతిలో పరిధి ఉండాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో దిగువ రాష్ట్రంగా వరద జలాలపై ఏపీకే హక్కు ఉండాలనీ ఆయన అభిప్రాయపడ్డారు.
ఎలా వాడుకున్నా ప్రశ్నించకూడదు..
ఆ హక్కును ప్రశ్నించేలా బోర్డుల పరిధి ఉండకూడదన్నారు. కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి ఆరు నెలల లోపు అనుమతులు తెచ్చుకోవాలని కూడా నోటిఫికేషన్ తేల్చింది. దిగువ రాష్ట్రంగా వరద అంతా మనకు వదిలేస్తారని, దానివల్ల వాటిల్లే నష్టాలు మనం భరిస్తున్నామని- ఆ నీటిని ఎలా వినియోగించుకున్నా ప్రశ్నించకూడని విధంగా హక్కు ఉండాలన్నారు. కొత్త ప్రాజెక్టులు మన నిధులతో నిర్మించుకుంటామని, వరద వస్తే ఆ నీళ్లు వినియోగించుకుంటామని, లేకుంటే అవి ఖాళీగా ఉంటాయని కూడా సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. గోదావరిపై కాటన్ బ్యారేజి, కృష్ణాపై ప్రకాశం బ్యారేజి, వాటి కాలువలు, అవుట్ లెట్‌లు కూడా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని కూడా అధికారులు ఆయనకు చెప్పినట్లు సమాచారం. ఉమ్మడి జలాశయాల వరకు బోర్డు పరిధిలో ఉంచితే సరిపోయేదని వారు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో జలవనరులశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి, సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.
మార్పులు కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తాం..