తెలంగాణ

telangana

ETV Bharat / city

AP- Odisha Meet: ఏపీ, ఒడిశాల సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ - ఒడిశా సీఎంతో జగన్ భేటీ వార్తలు

ఏపీ, ఒడిశా రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి సంయుక్త కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రులు నవీన్ పట్నాయక్, జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం భువనేశ్వర్‌ చేరుకున్న జగన్‌... భువనేశ్వర్‌లో నవీన్‌ పట్నాయక్‌తో ప్రత్యేకంగా సమావేశమై ఉభయ రాష్ట్రాల మధ్య కీలక అంశాలపై చర్చించారు.

AP- Odisha Meet
ఏపీ, ఒడిశా భేటీ

By

Published : Nov 10, 2021, 9:22 AM IST

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల మధ్య ఉన్న సమస్యలను చర్చలతో పరిష్కరించేందుకు ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో కమిటీ ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రులిద్దరూ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, నవీన్‌ పట్నాయక్‌ మధ్య మంగళవారం భువనేశ్వర్‌లో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేరడి బ్యారేజీ, జంఝావతి రిజర్వాయరు, పోలవరం ప్రాజెక్టు, బహుదా రిజర్వాయర్‌ నుంచి ఇచ్ఛాపురానికి నీటి విడుదల, బలిమెల, ఎగువ సీలేరు విద్యుత్‌ ప్రాజెక్టులకు పరస్పర ఎన్‌ఓసీలు, కొఠియా గ్రామాల వంటి అంశాల పరిష్కారానికి కలసికట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు. సమావేశం అనంతరం భువనేశ్వర్‌లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఏపీ సీఎం కార్యాలయం కూడా ఒక ప్రకటనలో ఆ సమావేశం వివరాలను వెల్లడించింది. సమావేశం ఫలప్రదంగా జరిగిందని ఇద్దరు ముఖ్యమంత్రులూ వేర్వేరుగా ట్వీట్‌ చేశారు.

గంజాయి సాగు అరికట్టేందుకు పరస్పర సహకారం
‘ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా సరిహద్దు రాష్ట్రాలే కాదు. రెండింటికీ వైభవోపేతమైన చరిత్ర, సాంస్కృతిక వారసత్వాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాలూ ప్రకృతి విపత్తుల సమయంలో పరస్పర సహకారం అందించుకుంటున్నాయి. జలవనరులు, ఉమ్మడి సరిహద్దు, ఇంధనం, వామపక్ష తీవ్రవాదం వంటి అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించారు. వామపక్ష తీవ్రవాదం, గంజాయి సాగు, రవాణాల్ని అరికట్టడం వంటి అంశాలపై రెండు రాష్ట్రాలు సహకరించుకోవాలని నిర్ణయించారు’ అని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.

బ్రహ్మపుర యూనివర్సిటీలో తెలుగు పీఠం
‘శ్రీకాకుళంలోని బి.ఆర్‌.అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ఒడియా పీఠాన్ని, ఒడిశాలోని బ్రహ్మపుర యూనివర్సిటీలో తెలుగు భాషా పీఠాన్ని ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. పాఠశాలల్లో తెలుగు, ఒడియా భాషల్ని బోధించే అధ్యాపకుల్ని నియమించాలని, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, భాషా పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రులు నిర్ణయించారు’ అని వెల్లడించారు.

సమస్యల పరిష్కారం దిశగా ముందడుగు: జగన్‌
‘సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య చాలా అపరిష్కృత అంశాలున్నాయి. వాటి పరిష్కారం దిశగా తొలిసారి ముందడుగేశాం. ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కమిటీ ఏర్పాటుచేయాలని నిర్ణయించడం సంతోషకరం. చర్చలు జరిపినందుకు, సంయుక్త కమిటీ ఏర్పాటుకు ముందుకొచ్చినందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు, ఒడిశా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర అధికారులకు ధన్యవాదాలు. రెండు రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాల్ని కాపాడటమే మా ధ్యేయం’ అని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఒడిశాలో పాక్షికంగా ముంపునకు గురువుతున్న ప్రాంతంలో రక్షణ చర్యలపై జగన్‌ సూచనలు చేశారు. ‘ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు ధన్యవాదాలు. సాదరంగా ఆహ్వానించి, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపినందుకు సంతోషంగా ఉంది. త్వరలో ఈ చర్చలు సత్ఫలితాలనిస్తాయని విశ్వసిస్తున్నాను’ అని జగన్‌ మంగళవారం రాత్రి ట్వీట్‌ చేశారు.

ఫలప్రదంగా చర్చలు: నవీన్‌ పట్నాయక్‌
‘జగన్‌తో సమావేశం చాలా సంతోషాన్నిచ్చింది. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై సుహృద్భావ వాతావరణంలో, ఫలప్రదమైన చర్చలు జరిగాయి. జలవనరులు, ఉమ్మడి సరిహద్దు, ఇంధనం, వామపక్ష ఉగ్రవాదం వంటి అంశాలపై చర్చించాం’ అని ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

జగన్‌కు సాదర స్వాగతం
విశాఖ నుంచి మంగళవారం సాయంత్రం 4.20 గంటలకు జగన్‌ భువనేశ్వర్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఒడిశా అధికారులు స్వాగతం పలికారు. ప్రభుత్వ అతిథి గృహానికి వెళ్లి, అక్కడి నుంచి లోక్‌సేవా భవన్‌కు చేరుకున్నారు. అక్కడ నవీన్‌ పట్నాయక్‌ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. తొలుత ఇద్దరి మధ్య సమావేశం, అనంతరం రెండు రాష్ట్రాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నూతన వధూవరులను

ఆశీర్వదించిన ముఖ్యమంత్రి
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వేదిత (ఐఏఎస్‌) వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్‌ మంగళవారం హాజరయ్యారు. నూతన వధువరూలను ఆశీర్వదించిన అనంతరం ఒడిశా బయలుదేరారు.

బాగున్నారా...అందరూ ఐక్యంగా ఉండాలి

ఒడిశాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు భువనేశ్వర్‌లోని రాష్ట్ర అతిథి భవనంలో ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. బాగున్నారా? అని వారిని జగన్‌ కుశల ప్రశ్నలు వేశారు. ఒడిశాలోని తెలుగువారంతా ఐకమత్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కౌశలాంధ్ర తెలుగు సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు దాసరి మురళీకృష్ణ ముఖ్యమంత్రిని శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. భువనేశ్వర్‌లోని ఆంధ్ర సాంస్కృతిక సమితి అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌, కటక్‌లోని ఐక్యత స్వచ్ఛంద సంస్థ ఛైర్మన్‌ వి.సుభాష్‌నాయుడు, ఆయా సంస్థల ప్రతినిధులు జగన్‌ను కలిశారు.

ఇదీ చదవండి:Collector Anudeep Wife Madhavi: సర్కార్ దవాఖానాలో కలెక్టర్‌ సతీమణి ప్రసవం

ABOUT THE AUTHOR

...view details