మహిళల రక్షణ కోసం 'ఈ– రక్షా బంధన్' కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం ప్రారంభించారు. రాఖీ పండుగ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దీనిని సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా ప్రజాప్రతినిధులు, విద్యార్థినులు, ఉద్యోగినులు సీఎంకు రాఖీ కట్టారు. అనంతరం ఈ- రక్షాబంధన్‌ను సీఎం ప్రారంభించారు.
నిపుణులతో అవగాహన
రాఖీ పండుగ సందర్భంగా రెండు కార్యక్రమాలు మొదలుపెట్టామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఇదివరకే అమూల్‌తో ఒప్పదం చేసుకోగా...సోమవారం వైయస్సార్ చేయూత, ఆసరా కార్యక్రమాలకు సంబంధించి హిందుస్థాన్ యూనిలీవర్, ప్రొక్టర్ అండ్ గాంబల్, ఐటీసీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. రాఖీ పండుగ రోజున మరో కార్యక్రమం కింద 4s4u.appolice.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామన్నారు. రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్ ఛానల్లో రకరకాల నిపుణులతో అవగాహన కల్పిస్తారన్నారు.