రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతుల ఖాతాల్లోకి పంట పెట్టుబడి రాయితీతో పాటు.. వైఎస్‌ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. నివర్ తుపానుతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ సైతం ఇస్తున్నట్టు తెలిపారు. రైతులకు మంచి ధరలు రావాలనేదే లక్ష్యమన్న ముఖ్యమంత్రి జగన్.. వారి ఖాతాల్లో రూ.1,766 కోట్లు జమ చేస్తున్నామని వెల్లడించారు. వారి కోసం 18 నెలల కాలంలో రూ.61,400 కోట్లు వెచ్చించామని చెప్పారు. 8 లక్షల 34 వేల మంది రైతులకు రూ.646 కోట్ల పెట్టుబడి రాయితీ అందించనున్నట్లు తెలిపారు.
రైతుభరోసా మూడో విడత కింద రూ.1,120 కోట్లు రైతులకు ఇస్తున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.13,500 రైతు భరోసాగా ఇస్తున్నామన్నారు. రైతుల నుంచి రూపాయి మాత్రమే తీసుకుని పంటలకు బీమా కల్పిస్తున్నామని చెప్పారు. పగటిపూట 9 గంటల విద్యుత్ కోసం రూ.1700 కోట్లు వెచ్చించామన్న ఏపీ ముఖ్యమంత్రి.. 18 నెలల్లో రైతుల కోసం 61 వేల 400 కోట్లు ఖర్చుచేసినట్లు తెలిపారు.