Jagan meet YSRCP cadre: నియోజకవర్గాల వారీగా వైకాపా కార్యకర్తలతో భేటీకి శ్రీకారం చుట్టిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. తెదేపా అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంతో మొదలుపెట్టారు. కుప్పం నియోజకవర్గంలో 50 మంది కార్యకర్తలను ఎంపిక చేసి.. తాడేపల్లి క్యాంపు ఆఫీసులో సమావేశమయ్యారు. ఒక్కో కార్యకర్తతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కుప్పంలో గెలిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వారి దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించారు. పార్టీలో సమస్యలతో సహా వాటికి పరిష్కార మార్గాలు కోరారు. నియోజకవర్గ సమస్యలను కార్యకర్తలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
MLC Bharath: కుప్పంలో పలు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కుప్పం ఇన్చార్జ్, ఎమ్మెల్సీ భరత్ సీఎం జగన్ను కోరారు. సమస్యల పరిష్కారానికి రూ.67 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా.. రెండు రోజుల్లో జీవో ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు భరత్ తెలిపారు. హంద్రీనీవా కెనాల్ పనులు మూడేళ్లైనా పూర్తి చేయలేదని తెలపగా.. వేరేవారికి కాంట్రాక్ట్ ఇచ్చి ఏడాదిలో పూర్తి చేస్తామని సీఎం తెలిపారన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని.. వచ్చే ఎన్నికల్లో గెలిచే తొలి సీటు కుప్పం కావాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు.