గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య రగులుతున్న జల వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి(CM JAGAN) స్పందించినట్లు తెలుస్తోంది. సున్నితంగా, సామరస్యంగా పరిష్కరించుకోవాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం.
సున్నితంగా పరిష్కరించండి..
‘తెలంగాణలో మన (ఏపీ) ప్రజలున్నారు.. ఆ సున్నితాంశాన్ని మనం గమనించి.. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశాన్ని చూడాలి’ అని బుధవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రైతులు నష్టపోతుంటేనో.. ఆ ప్రాంతం వారికి తాగునీటి వంటి అత్యవసరాల కోసమో నీటిని తీసుకుంటే అర్థం ఉందిగానీ, ఆ పరిస్థితి లేకుండానే నీటిని తీసుకుంటున్నారని సీఎం మంత్రులతో చర్చలో అన్నట్లు తెలిసింది.
కరెంటు పేరుతో నీటిని తోడేస్తే ఎలా..?
‘తెలంగాణలో రైతులు ఇబ్బంది పడాలని, తెలంగాణకు విద్యుత్ వద్దు అని మనం అనడం లేదు... అలాగని విద్యుదుత్పత్తి పేరుతో తెలంగాణ వారు శ్రీశైలంలోని నీటిని తోడేస్తామంటే ఎలా?’ అని సీఎం అన్నట్లు తెలిసింది. ‘జూన్ 1 నాటికి నాగార్జునసాగర్‌లో నీరున్నా.. అక్కడ విద్యుదుత్పత్తి చేయకుండా 799 అడుగుల వరకే ఉన్న శ్రీశైలంలో నీటిని విద్యుదుత్పత్తి కోసం తోడేశారు. ఇది దుర్మార్గమని, శ్రీశైలంలో అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుదుత్పత్తిని ఆపేయించాలని మనం (ఏపీ ప్రభుత్వం) కృష్ణా నది యాజమాన్య బోర్డుకు లేఖ రాశాం. జూన్ 15న బోర్డు విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణకు బోర్డు లేఖ పంపింది. కానీ, తర్వాత అన్ని ప్రాజెక్టుల వద్ద పూర్తి సామర్థ్యంతో విద్యుదుత్పత్తిని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. శ్రీశైలం నుంచే విద్యుదుత్పత్తి కోసం ఇప్పటికే 7 టీఎంసీలు తోడేశారు. ఆ నీరు నాగార్జున సాగర్‌కు చేరాక, అక్కడా ఈ మధ్యనే విద్యుదుత్పత్తి చేస్తున్నారు. ఆ నీరు పులిచింతల నుంచి తర్వాత ప్రకాశం బ్యారేజీకి వస్తోంది. అక్కడ మనం నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. దానివల్ల నీరంతా వృథాగా సముద్రంలోకి పోవాల్సిందే. ఇది కరెక్టు కాదు కదా?’ అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. తెలంగాణ మంత్రులు, నాయకులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు మంత్రులు ప్రస్తావించగా.. ముఖ్యమంత్రి పై విధంగా స్పందించినట్లు తెలిసింది. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు మంత్రిమండలిలో వివిధ అంశాలపై జరిగిన చర్చ వివరాలు చూస్తే...
తెలంగాణది దుర్మార్గమైన చర్య: మంత్రులు
మంత్రిమండలి సమావేశం ముగిసిన అనంతరం సచివాలయంలో మంత్రులు అనిల్ కుమార్, పేర్ని నాని విలేకర్లతో మాట్లాడుతూ జల వివాదాల అంశంపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు ఉత్పత్తి కోసం డెడ్ స్టోరేజీ కంటే తక్కువ స్థాయి నుంచి కృష్ణా జలాల్ని తీసుకోవడాన్ని దుర్మార్గమైన చర్యగా ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి భావిస్తోందని మంత్రులు పేర్కొన్నారు. చేస్తున్నది తప్పా.. ఒప్పా? అనే స్పృహ లేకుండా, రైతుల అవసరాల గురించి ఆలోచించకుండా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుత్తు ఉత్పత్తి చేయడాన్ని ఏపీ మంత్రి మండలి తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఏపీ ప్రయోజనాల్ని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్తామని.. సంయమనంతో వ్యవహరిస్తుంటే దాన్ని చేతకానితనంగా భావించొద్దని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ అక్రమ నీటి వినియోగంపై అసమ్మతి తెలుపుతూ ప్రధానమంత్రి, జల్‌శక్తి మంత్రి, కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి వెంటనే ముఖ్యమంత్రి జగన్ లేఖలు రాస్తారని వెల్లడించారు. సాగునీటి వినియోగం విధివిధానాలు (ప్రొటోకాల్స్) అన్నింటినీ ఉల్లంఘించి తమ విద్యుత్తు తాము ఉత్పత్తి చేసుకుంటామనే రీతిలో తెలంగాణ వ్యవహరించడాన్ని చూస్తూ ఊరుకోబోమని... ప్రతిఘటన తీవ్రంగానే ఉంటుందన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమమని మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వం... పాలమూరు-రంగారెడ్డి, డిండి, నెట్టెంపాడు-కల్వకుర్తి విస్తరణ ప్రాజెక్టులను ఎలాంటి అనుమతులు లేకుండానే ఎలా చేపట్టిందని ప్రశ్నించారు. వారేమో ఇష్టానుసారంగా ప్రాజెక్టులు చేపట్టొచ్చు కానీ.. రాష్ట్రానికి చేసిన నీటి కేటాయింపులకు లోబడి మాత్రమే ఏపీ ప్రాజెక్టులు నిర్మించుకోకూడదా? అని నిలదీశారు. మంత్రుల వ్యాఖ్యలు.. వారి మాటల్లోనే!
అంతకు పదింతలు ఎక్కువ మాట్లాడగలం..
‘తెలంగాణ మంత్రులు గత పది రోజులుగా రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి, ప్రస్తుత సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని దూషిస్తున్నారు. రెచ్చిపోయే భాషలో మాట్లాడితేనే సమస్య పరిష్కారం అవుతుందనుకుంటే.. తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న దానికి పదింతలు అధికంగా మాట్లాడగలం. అయినా మేం మాట్లాడటం లేదంటే.. చేతకాక కాదు. సమస్య సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నాం. రెచ్చగొడితే మేం రెచ్చిపోము. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీ వారు తెలంగాణలో, తెలంగాణ వారు ఏపీలో ఉంటున్నారు. అందరూ బాగుండాలి, అన్ని ప్రాంతాలూ బాగుండాలనే ఆలోచనతో సీఎం జగన్ ఉన్నారు.
కేటాయింపులకు లోబడే..