వైఎస్సార్ ఆసరా పథకం రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేడు ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించనున్నారు. ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ నిధులు విడుదల చేయనున్నారు. సీఎం జగన్ రేపు ఉదయం 9.55 గంటలకు తాడేపల్లి నుంచి ఒంగోలుకు బయలుదేరతారు.
ఉదయం 11 గంటలకు ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ పరిశీలిస్తారు. అనంతరం సభా వేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. సీఎం ప్రసంగం తర్వాత వైఎస్‌ఆర్ ఆసరా కార్యక్రమం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.05 నిముషాలకు తిరుగు పయనమవుతారు. 1.55 నిముషాలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
గతేడాది ఒకేసారి ఇచ్చేశారు
ఆసరా మొదటి విడత మొత్తాన్ని గతేడాది ఒకేసారి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో సెప్టెంబరు 11న జమ చేశారు. లబ్ధిదారులు వారి అనుకూలత ఆధారంగా బ్యాంకులకు వెళ్లి నగదును తీసుకున్నారు. ఈ ఏడాదికి సంబంధించిన సంక్షేమ క్యాలెండర్‌లోనూ సెప్టెంబరులోనే రెండో విడత సాయాన్ని అందిస్తామన్నారు. కానీ... పథకం అక్టోబరుకు బదిలీ అయింది. సాయాన్ని కూడా విడతల వారీగా జమ చేయాలని నిర్ణయించారు.
డ్వాక్రా కార్యకలాపాల్లోకి వాలంటీర్లు
ఆసరా పథకం ద్వారా డ్వాక్రా సంఘాల కార్యకలాపాల్లోకి ప్రభుత్వం మొదటిసారిగా వాలంటీర్లను తెచ్చింది. ఆసరానుపక్కాగా అమలు చేసేందుకు సెర్ప్/మెప్మా అధికారులు ఇప్పటికే యానిమేటర్లు/వీవోఏలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారుల బయోమెట్రిక్ నమోదు చేయించారు. తాజాగా లబ్ధిదారుల జాబితాను క్లస్టర్ల వారీగా విభజించి వాలంటీర్లకు యాప్‌లో అందించారు. లబ్ధిదారుల ఫొటోలను తీసి, నమోదు చేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను ఇప్పటికే క్షేత్రస్థాయిలో వాలంటీర్లు మొదలుపెట్టారు.
ఇదీ చదవండి:TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ...నేటి నుంచి వాహన సేవలు