రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను ఆగస్టు 16 నుంచి పునః ప్రారంభించాలని, అప్పటిలోగా అంతా సన్నద్ధంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. నూతన విద్యావిధానం విధివిధానాలను అదే రోజు ప్రకటించాలని చెప్పారు. జాతీయ విద్యావిధానాన్ని అనుసరించి స్కూళ్ల వర్గీకరణ, ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉంటే ఆ ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ఫౌండేషన్ బడుల్లో భాగంగా అంగన్‌వాడీల నుంచే ఆంగ్ల మాధ్యమం ప్రారంభమవుతుందని తెలిపారు. అంగన్‌వాడీలు శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మారుతాయని, వీటికి ఫౌండేషన్ స్కూళ్లు మార్గనిర్దేశం చేస్తాయని తెలిపారు.
శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాల ప్రతి ఆవాసంలోనూ ఉంటుందని, కిలోమీటరు లోపే ఫౌండేషన్ బడి ఏర్పాటవుతుందని వివరించారు. మూడు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నత పాఠశాల ఉంటుందని చెప్పారు. వీటన్నింటినీ పక్కాగా ఏర్పాటుచేస్తూ నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఒక్క బడినీ మూసేయబోమని, ఎవ్వరినీ తొలగించబోమని ప్రకటించారు. మొదటి విడత నాడు-నేడు కింద రూపుదిద్దిన పాఠశాలలను ఆగస్టు 16న ప్రజలకు అంకితం చేస్తామని, అదేరోజు రెండోవిడత నాడు-నేడు పనులు, విద్యాకానుక ప్రారంభిస్తామన్నారు. విద్యాశాఖ, అంగన్‌వాడీల్లో నాడు-నేడుపై శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం సమీక్షించారు.
200 మందికి ఒకే ఉపాధ్యాయుడు
- ప్రస్తుతం కొన్నిచోట్ల 200 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. మరికొన్ని చోట్ల నలుగురు విద్యార్థులకు ఒకరు బోధిస్తున్నారు. ఐదో తరగతి వరకూ ప్రతి ఉపాధ్యాయుడూ 18 సబ్జెక్టులు బోధిస్తున్నారు. ఇంటర్ తర్వాత డీఈడీ చేసి ఎస్జీటీలుగా పనిచేస్తున్నారు. నూతన విద్యావిధానం ద్వారా ఈ పరిస్థితుల్లో మార్పులు తెస్తాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి శాస్త్రీయంగా ఉండేలా రూపొందిస్తున్నాం. ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు వస్తారు.
- కొత్త విధానంలో 12వ తరగతి వరకూ ఆరు రకాల పాఠశాలలు ఉంటాయి. ఐదో తరగతి వరకూ 18 సబ్జెక్టులను బీఈడీ, పీజీ పూర్తిచేసిన నైపుణ్యమున్న ఉపాధ్యాయులే బోధిస్తారు. తద్వారా చిన్నారులకు నిశిత శిక్షణ ఉంటుంది.ఉపాధ్యాయుల్ని సమర్థంగా వినియోగించుకోవడమే నూతన విద్యావిధానం ప్రధాన లక్ష్యం.