పెద్ద చిట్టాతోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిల్లీకి బయలుదేరారు. ఈ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్ గురువారం రాత్రి 9 గంటలకు సమావేశమయ్యారు. రాత్రి 10.35 నిమిషాల వరకు ఇద్దరి మధ్య పలు కీలకాంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారని.. వైకాపా నేతలు చెబుతున్నారు. 3 రాజధానులకు అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోరారని.. అందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించారని వివరిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీనోటిఫికేషన్ జారీ చేయాలని కోరగా అమిత్‌షా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. కనుమరుగైన ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారని.. విభజన తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా రాష్ట్రం సమస్యలను ఎదుర్కొంటోందని అమిత్‌షాకు జగన్ వివరించినట్టు నేతలు చెబుతున్నారు.
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే.. అనేక రంగాల్లో స్వయం సమృద్ధి దిశగా నడిపించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా రాష్ట్రానికి కేంద్ర గ్రాంట్లు అధికంగా వస్తాయని.. అప్పుడు ఆర్థిక భారం తగ్గుతుందని సీఎం జగన్ అమిత్‌షా వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగ, ఉపాధి కల్పన జరగాలన్నా ప్రత్యేక హోదా అవసరమని.. ప్రత్యేక హోదా ఇవ్వాలని మరోమారు విన్నవించారు ముఖ్యమంత్రి. ఈ అంశాన్ని పరిశీలిద్దామని అమిత్‌షా హామీ ఇచ్చినట్టు సమాచారం. అయితే అంతర్గంతంగా ఏం చర్చ జరిగిందనే విషయం పక్కనబెడితే.. సీబీఐ కేసులు, రఘురామ రాజు గొడవపైనే ఎక్కువ చర్చ జరిగినట్టు ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బెయిల్ రద్దు అవుతుందనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ భేటీకి చాలా ప్రాధాన్యత చేకూరింది. అంతకుముందు కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్, గజేంద్రసింగ్ షెకావత్, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌ను జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలు, ఇతర అంశాలపై చర్చించారు.
రెండోరోజు సాగిందిలా..
రెండోరోజు పర్యటనలో భాగంగా ఉక్కు, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సీఎం జగన్భేటీ అయ్యారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, కాకినాడ పెట్రో కాంప్లెక్స్, పెట్రో వర్సిటీ ఏర్పాటు తదితర అంశాలపై ధర్మేంద్ర ప్రధాన్‌తో చర్చించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచన చేయాలని కోరారు. ఈ విషయంలో తాము సూచించిన ప్రత్యామ్నాయాలను మరోసారి కేంద్రమంత్రికి వివరించారు. కాకినాడ సెజ్‌లో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలో రాష్ట్రంపై పెద్దగా భారం లేకుండా చూడాలనిజగన్విజ్ఞప్తి చేశారు. ఏపీలో కచ్చితంగా పెట్రో కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని తెలిపిన ధర్మేంద్ర ప్రధాన్.. వయబిలిటీ గ్యాప్ ఫండ్ విషయంలోనూ సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చేవారం ఏపీ సీఎస్, పెట్రోలియం శాఖలోని కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. దాదాపు గంటకుపైగా ధర్మేంద్ర ప్రధాన్‌తో సీఎం సమావేశం కొనసాగింది.