Night Curfew Lifted in AP: ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూను తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాప్తి గణనీయంగా తగ్గినందున కర్ఫ్యూను తొలగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కర్ఫ్యూ తొలగించినా.. కొవిడ్ బారిన పడకుండా మార్గదర్శకాలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కొవిడ్‌పై సమీక్ష నిర్వహించిన సీఎం.. ప్రజలంతా మాస్క్‌లు ధరించేలా చూడాలని ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
రిక్రూట్మెంట్ పూర్తి చేయాలి..
ఫీవర్ సర్వే కొనసాగించాలన్న సీఎం.. లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలన్నారు. వాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపైనా సమీక్షించిన సీఎం.. ఆ శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేరు చేయాలని సీఎం ఆదేశించారు. నిపుణులైన వారికి పరిపాలనా బాధ్యతలను అప్పగించాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం ఆదేశించగా.. వీటిపై మార్గదర్శకాలు తయారు చేసినట్లు అధికారులు వెల్లడించారు.