AP CM Jagan on paper leak: వైకాపా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే పదోతరగతి పేపర్లు లీక్ చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన నారాయణకు చెందిన రెండు పాఠశాలలు.. మూడు చైతన్య స్కూల్స్ నుంచే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు. జగనన్న విద్యాదీవెన పథకం నిధులను.. తిరుపతి వేదికగా విడుదల సీఎం చేశారు. గత ప్రభుత్వాలేవీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవన్నీ తట్టుకోలేక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
"జగనన్న అమ్మఒడి కార్యక్రమానికి రూ.13,023 కోట్లు ఖర్చు చేశాం. జూన్‌లో అమ్మఒడి కార్యక్రమానికి మరో రూ.6400 కోట్లు ఇస్తాం. తగిన చర్యలు తీసుకున్నందునే రాష్ట్రంలో మార్పు కనిపిస్తోంది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల సంఖ్య 73 లక్షలకు చేరింది."