ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటిని న్యాయంగా వాడుకుంటే తప్పేంటని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(AP CM JAGAN) ప్రశ్నించారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 800 అడుగుల్లోపు ఉన్నప్పుడే మీకు కేటాయించిన నీటిని మీరు వాడుకుంటే తప్పు లేనప్పుడు.. అదే 800 అడుగుల్లోపు ఉంటే రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కేటాయించిన నీటిని మేం వాడుకుంటే తప్పేంటని తెలంగాణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొరుగు రాష్ట్రంతో విభేదాలు వద్దని, అక్కడా, ఇక్కడా ప్రజలు బాగుండాలంటే పాలకుల మధ్య సఖ్యత ఉండాలని జగన్(AP CM JAGAN) పేర్కొన్నారు. అందుకే తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర రైతు దినోత్సవం సందర్భంగా గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
‘ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రాంతానికి నీటి వాటా ఎంతో అందరికీ తెలిసిన లెక్కలే. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ, తెలంగాణకు నీటి కేటాయింపులు జరిగాయి. రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీల చొప్పున జరిగిన నీటి కేటాయింపులపై 2015 జూన్ 19న రెండు రాష్ట్రాలు, కేంద్రం సంతకాలు చేశాయి. శ్రీశైలంలో 881 అడుగుల పైకి నీరు చేరితే తప్ప పోతిరెడ్డిపాడు నుంచి ఫుల్ డిశ్ఛార్జి నీరు కిందికి రాదు. గత 20 ఏళ్లలో కేవలం 20 నుంచి 25 రోజులు మాత్రమే 881 అడుగుల పైకి నీరున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలోని పాలమూరు- రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల సామర్థ్యాన్ని పెంచి నీటిని వాడుకుంటున్నారు. మరోవైపు 796 అడుగుల్లోపు తెలంగాణ విద్యుత్తుత్పత్తి చేస్తోంది. అలాంటప్పుడు అదే 800 అడుగుల్లోపులో రాయలసీమ ఎత్తిపోతల ద్వారా కేటాయించిన నీటిని మేం వాడుకుంటే తప్పేంటి’ అని సీఎం అన్నారు.
మాది రైతు పక్షపాత ప్రభుత్వం
రైతు దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి(AP CM JAGAN) తొలుత రాయదుర్గం మండలం 74-ఉడేగోళం గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, కస్టమ్ హైరింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. రాయదుర్గం మార్కెట్ యార్డులో వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను, విద్యార్థి పాఠశాల మైదానంలో రైతు భరోసా రథాలను ప్రారంభించారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ బతికి ఉన్నంతకాలం రైతు కోసం పరితపించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని, గడిచిన రెండేళ్లలో ఎన్నో పథకాలు అమలు చేశామన్నారు. రైతు భరోసా కింద రూ.17,029 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఏర్పాటు చేశామన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడానికి, అవసరమైన సలహాలు, సూచనలు చేయడానికి ప్రతి ఆర్బీకేలో అగ్రికల్చర్ బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.
అభివృద్ధి అంటే ఇదే..
‘నేనంటే గిట్టని కొంతమంది రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. రెండేళ్లలో గ్రామాల రూపురేఖలు మార్చాం. నాడు-నేడు ద్వారా పాఠశాలలను బాగు చేశాం. రైతుభరోసా కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రతి గ్రామంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం’ అని సీఎం చెప్పారు. ఇదంతా అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. అమూల్‌ను రాష్ట్రం మొత్తం విస్తరింపజేసి భవిష్యత్తులో పాల విప్లవం తీసుకొస్తామని ప్రకటించారు.
చంద్రబాబు అప్పుడేం చేశారు?