తెలంగాణ

telangana

ETV Bharat / city

Cabinet reshuffle: 11న మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ..! - సీఎం జగన్ వార్తలు

Cabinet reshuffle: ఏపీ మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ వచ్చే నెల 11న ఉండవచ్చని వైకాపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త మంత్రిమండలి ఏర్పాటుకు ఈ నెల 30, ఏప్రిల్‌ 11 తేదీలను మంచి రోజులని సీఎంకు కొందరు చెప్పినట్లు తెలిసింది.

cm jagan Cabinet reshuffle
cm jagan Cabinet reshuffle

By

Published : Mar 27, 2022, 9:13 AM IST

Cabinet reshuffle: ఏపీ మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ వచ్చే నెల 11న ఉండవచ్చని అధికార వైకాపా, ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈలోగా ప్రస్తుత మంత్రులతో సీఎం జగన్‌ సమావేశమై వారికి విందు ఇస్తారన్న ప్రచారమూ ఉంది. కొత్త మంత్రిమండలి ఏర్పాటుకు ఈ నెల 30, ఏప్రిల్‌ 11 తేదీలను మంచి రోజులని సీఎంకు కొందరు చెప్పినట్లు తెలిసింది. అయితే ఏప్రిల్‌ 1 అమావాస్య. దానిముందు ఎందుకన్న ఉద్దేశంతో మార్చి 30ని పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు. కాబట్టి 11నే కొత్త మంత్రివర్గం ఏర్పాటు ఉంటుందనే మాట వినిపిస్తోంది. ఒక మంత్రి తన సన్నిహితుల వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే ముఖ్యమంత్రి ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి.

వాళ్లను తగ్గించి.. వీళ్లను పెంచి:ప్రస్తుత మంత్రిమండలిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన మంత్రులు నలుగురు (దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డితో కలిపి) ఉన్నారు. కొత్త మంత్రిమండలిలో వీరి సంఖ్యను 3కి పరిమితం చేస్తారని తెలిసింది. కాపు సామాజికవర్గం నుంచి అయిదుగురు ఉండగా వీరి సంఖ్యను 4కి కుదిస్తారని సమాచారం. ఇక్కడ తగ్గిన రెండు సీట్లలో ఒకటి బీసీ, మరోటి ఎస్సీకి అదనంగా కేటాయిస్తారని సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అందరినీ తీసేసే అవకాశమూ లేకపోలేదు:వివిధ సమీకరణల దృష్ట్యా ప్రస్తుత మంత్రుల్లో ఇద్దరో ముగ్గురో కొనసాగవచ్చని ఇటీవల ముఖ్యమంత్రి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దానిపైనే పీటముడి పడినట్లుగా చెబుతున్నారు. ఇలా కొందరిని కొనసాగిస్తే మిగిలిన వారి నుంచీ ఒత్తిడి పెరుగుతుందని, పరిగణనలోకి తీసుకోకపోతే వారు అసంతృప్తి చెందే అవకాశం ఉందన్న వాదననూ సీఎం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. సర్దుబాటు అయితే సరేసరి లేకపోతే మొత్తం అందరినీ మార్చేసేందుకూ ఆయన సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.

మండలి ప్రాతినిధ్యం ఉంటుందా?:వైకాపా అధికారంలోకి వచ్చాక అప్పట్లో ఎమ్మెల్సీగా ఉన్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ని మంత్రిని చేయడం వల్ల ఆయన శాసనమండలిలో సభా నాయకుడిగా వ్యవహరించారు. 2020లో ఆయన్ను రాజ్యసభకు పంపడంతో అప్పటి నుంచి మండలిలో సభా నాయకుడి పదవి ఖాళీగానే ఉంది. ఇప్పుడు మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో మండలికి ప్రాతినిధ్యం కల్పిస్తే సభానాయకుడి పదవినీ భర్తీ చేసినట్లవుతుందన్న వాదన ఉంది. దీంతో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తలశిల రఘురాం, షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌, అరుణ్‌కుమార్‌, జంగా కృష్ణమూర్తి తదితర ఎమ్మెల్సీలు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. అయితే ఎమ్మెల్సీల పేర్లు కొత్త మంత్రిమండలి కూర్పులో పరిశీలనలో లేవనేది ఇప్పటివరకూ ఉన్న సమాచారం. తుది జాబితాలో ఏమవుతుందో చూడాలి.

ఇదీ చదవండి:'ధాన్యం కొనుగోలుపై.. ప్రధానికి నేటి నుంచి తీర్మానాల ప్రతులు'

ABOUT THE AUTHOR

...view details