ఏపీలో 17 వేల కాలనీలు రాబోతున్నాయని ఆ రాష్ట్ర సీఎం జగన్ అన్నారు. రెండు దశల్లో కలిపి దాదాపు 30 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతుందన్నారు. గ్రామాలు, పట్టణాలుగా నిర్మితమవుతున్న ఈ కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హమీ ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Ap Cm Jagan : ఏపీలో 1.84 కోట్ల మందికి ఇళ్లు - house scheme in ap
పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. తొలిదశలో రూ.28,084 కోట్ల వ్యయంతో పక్కా గృహాల నిర్మిస్తామన్నారు. రెండో దశలో రూ.22,860 కోట్ల వ్యయంతో పక్కా గృహాల నిర్మాణం ఉంటుందని ఆ రాష్ట్ర సీఎం స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా వైఎస్‌ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణాల కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు.
ఏపీలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు. మహిళల పేరిట ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేశాం. జూన్ 10 వరకు పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణం చేయిస్తాం. 31 లక్షల మందికి పైగా పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తున్నాం. రెండు దశల్లో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నాం. తొలి దశను 2022 జూన్ నాటికి పూర్తిచేస్తాం. రెండో దశను వచ్చే ఏడాది జూన్‌లో ప్రారంభిస్తాం. 8900 లేఔట్లలో 11 లక్షల 26 వేల ఇళ్ల నిర్మాణాలకు ఇవాళ శ్రీకారం చూట్టాం. ఇళ్ల స్థలాలు ఉన్న 4.33 లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశాం. రాష్ట్రంలో మొత్తం 15.60 లక్షల ఇళ్లకు మొదటి దశలో పనులు ప్రారంభించాం. రాష్ట్రంలో 1.84 కోట్ల మందికి ఇళ్లు కట్టిస్తున్నాం. రాష్ట్ర జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరికి పక్కా ఇల్లు ఇస్తాం. జగనన్న కాలనీలో రూ.4128 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తాం. రూ.22,587 కోట్లతో భూగర్భ డ్రెయినేజీలు, సీసీ రహదారులు వేయించనున్నాం. జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు కేటాయించాం.
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి