తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారం కోసం... పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చిన అత్యున్నత మండలి-అపెక్స్ కౌన్సిల్ సమావేశం... ఈ నెల 6న జరగనుంది. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేతృత్వంలో దృశ్యమాధ్యమం ద్వారా జరిగే సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ పాల్గొంటారు. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోని ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వడం, గోదావరి జలాల్లో వాటా, కృష్ణాబోర్డు తరలింపు సహా ఇతర అంశాలపై భేటీలో చర్చించనున్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్... ఇవాళ నీటిపారుదలశాఖ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో పాటు న్యాయనిపుణులు సమీక్షకు హాజరుకానున్నారు.
యావత్ దేశానికి తెలిసేలా..
రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలతో సమావేశానికి రావాల్సిందిగా అధికారులను... ముఖ్యమంత్రి ఆదేశించారు. నదీజలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కావాలనే... కయ్యం పెట్టుకుంతోందని ఆక్షేపించిన సీఎం వారి వాదనలకు అపెక్స్ కౌన్సిల్ భేటీలో ధీటైన సమాధానం చెప్పి మళ్లీ తెలంగాణ జోలికి రాకుండా వాస్తవాలు కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేయాలని నిర్దేశించారు. అటు కేంద్రప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, ఏడు సంవత్సరాల అలసత్వాన్ని కూడా ఎండగట్టాలని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల హక్కులను హరించేందుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ప్రతిఘటించి నిజానిజాలను యావత్ దేశానికి తేటతెల్లం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు.