ప్రశ్నించేవారిని ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసు యంత్రాంగంతో అరెస్టులు చేయిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ పెద్ద రాజకీయ కుట్రదారుడని... ఏ స్థాయికైనా దిగజారుతారని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారికి కరోనా రావాలని శపించిన వ్యక్తి కేసీఆర్ అంటూ భట్టి విరుచుకుపడ్డారు. పోలీసు స్టేషన్, పోలీసు వాహనాల్లో శానీటైజ్ చేయకుండానే విపక్ష నేతలను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారని ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రిని ఆ వాహనంలోనే తీసుకెళ్తారా..? సీఎల్పీ నేత భట్టి - ప్రభుత్వంపై భట్టి విక్రమార్క మండిపాటు
కరోనా కట్టడికి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. శానిటైజేషన్ చేయకుండానే... విపక్ష నేతలను అరెస్టు చేసి స్టేషన్కు తరలిస్తున్నారని ఆరోపించారు.
ముఖ్యమంత్రిని ఎక్కడికైనా తీసుకెళ్లాల్సి వస్తే ఆ వాహనాల్లోనే తీసుకెళ్తారా అని పోలీసులను ప్రశ్నించారు. అరెస్టు చేసే ముందు వాహనాలను, స్టేషన్ను శుభ్రపరిచి తీసుకువెళ్లాలని కోరారు. పోలీసు వాహనాల ద్వారా తమ నేతలకు ఎవరికైనా కరోనా సోకితే సీఎం కేసీఆర్, డీజీపీలు బాధ్యత వహించాలన్నారు. అవసరమైతే కేసులు వేసేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. పోలీసులు తీసుకెళ్లే వాహనాల్లో కార్యకర్తలు గుడ్డిగా ఎక్కవద్దని సూచించారు.
ఇదీ చూడండి:రాజ్ భవన్ వద్ద ఆందోళనకు కాంగ్రెస్ యత్నం.. నేతల అరెస్టు