ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti comments on kcr) అన్నారు. కానీ అమిత్ షాను కలవగానే యూటర్న్ తీసుకోవద్దన్నారు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని చెప్పి.. అమిత్‌షాను కలవగానే యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేయాల్సిన పనిచేయకుండా రాజకీయ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల డీపీఆర్ అడిగితే.. పట్టించుకోవడం లేదన్నారు.
కేసీఆర్ మాటలు.. ముఖ్యమంత్రికి, కేంద్ర జల్‌శక్తి మంత్రికి వ్యక్తిగత గొడవలా ఉన్నాయన్నారు భట్టి. దిల్లీలో కేసీఆర్ యుద్ధం చేసి వచ్చేసరికి ఇక్కడ వడ్లన్నీ మొలకెత్తేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. సాగుచట్టాలపై ఆందోళనల్లో భాగంగా దిల్లీ సరిహద్దుల్లో అమరులైన రైతులకు పరిహారం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడి ఏడున్నరేళ్లు అవుతున్న 1200 మంది అమరుల కుటుంబాలకు ఎందుకు న్యాయం చేయలేదని ప్రశ్నించారు.