నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో రబీ సాగుపై సందిగ్ధత నెలకొంది. జలాశయంలో సమృద్ధిగా నీటి నిల్వ ఉన్నా విడుదలపై అనిశ్చితి ఏర్పడింది. సాగుపై ప్రభుత్వం, జలవనరుల శాఖ అధికారుల నుంచి స్పష్టత రాలేదు. ఖరీఫ్‌లో నష్టాల్ని రబీలో పూడ్చుకోవాలని రైతులు వరి నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. అధిక మొత్తం చెల్లించి కౌలుకు భూములు తీసుకుని సాగు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధి జిల్లాలో కుడి కాలువ కింద ఈ ఏడాది ఖరీఫ్‌లో 6,53,725 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు. వీటిలో మెట్ట పైర్లు 4.88 లక్షలు, 1.65,488 ఎకరాల్లో వరి పండించారు. పదేళ్ల తరువాత కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరదల కారణంగా పలుమార్లు గేట్లు ఎత్తడంతో నీరంతా సముద్రం పాలైంది. నివర్ తుపాను ప్రభావంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూషికాల ముప్పేట దాడులు, తెగుళ్లతో పెట్టుబడులు పెరిగాయి. దిగుబడులు దిగదుడుపే..నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో ఖరీఫ్‌లో వరి దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఎకరాకు సగటున 20 నుంచి 30 బస్తాలు (75 కిలోలు) వస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు లభించడం లేదు. ప్రస్తుతం 76 కిలోల బస్తా రూ.1,100 నుంచి 1,150 వరకు కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడులు, కౌలు పోగా రైతులకు మిగులు ఉండటం లేదని వాపోతున్నారు. సాగర్ ఆయకట్టు కింద తక్కువ కాలంలో పంట చేతికి అందే సోనాలు రకాలు సాగుకు ఉపక్రమిస్తున్నారు. సన్న రకాలైన (సోనమ్) 12 కిలోల విత్తనాల సంచి రూ. వెయ్యికి కొనుగోలు చేసి నారుమడులు పోస్తున్నారు. జనవరి మొదటి వారంలోనే సాగు చేయాలనే సంకల్పంతో మెట్ట పైర్లు పూర్తయిన చేలను కౌలుకు తీసుకుని మడులు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు ఎకరాకు 30 రోజులకే రూ.పది వేలు కౌలు చెల్లిస్తున్నారు.91 టీఎంసీల వినియోగంనాగార్జునసాగర్ కుడి కాలువ పరిధి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు 162 టీఎంసీల నీటిని కేటాయించాలని జలవనరుల శాఖ అధికారులు కృష్ణా నది యాజమాన్య బోర్డుకు విన్నవించారు. రెండు జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాల కోసం ఆయా కేటాయింపులు ఇవ్వాలని నివేదించారు. ఈ నెల 27వ తేదీ వరకు మొత్తం 91 టీఎంసీల నీటి వినియోగం జరిగింది. వేసవిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి అవసరాలకు 10 టీఎంసీలకు తోడు మొత్తంగా 162 టీఎంసీల నీటిని ఎన్నెస్పీ అధికారులు కోరుతున్నా కేఆర్‌ఎంబీ కేటాయింపులు జరపలేదు.