నేటి నుంచే 6,7, 8 తరగతులు ప్రారంభం... అనుమతి తప్పనిసరి కరోనా కల్లోలంతో మూతపడిన విద్యాలయాలు... ఈనెల 1 నుంచి తెరుచుకున్నాయి. 9 తరగతి... ఆపై విద్యార్థులకు ప్రత్యక్షబోధన జరుగుతోంది. బుధవారం నుంచి ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకూ పాఠశాలల్లో ప్రత్యక్షబోధన ప్రారంభించాలని విద్యా శాఖ నిర్ణయించింది. మార్చి ఒకటో తేదీ వరకూ పూర్తిస్థాయిలో 6, 7, 8 తరగతులకు బోధన జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తల్లిదండ్రుల లిఖిత పూర్వక అనుమతి ఉంటేనే.. విద్యార్థులను అనుమతించాలని.. ప్రభుత్వం, ప్రైవేట్ పాఠశాలలకు స్పష్టం చేశారు.
ఇబ్బందులు తలెత్తలేవు
ఈనెల 1 నుంచి పాఠశాలల్లో తొమ్మిది, పదో తరగతితోపాటు ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యాయి. క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు.. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు 1 నుంచి 8 తరగతులు కూడా ప్రారంభించాలని విద్యా సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు ఒత్తిడి తెచ్చాయి. విద్యాసంస్థల నిర్వహణపై ఇటీవల సమీక్ష జరిపిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నతాధికారులు... ఆరు నుంచి 8 తరగతులు కూడా ప్రారంభించాలని ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతించడంతో.. బుధవారం నుంచే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలి
విద్యాసంస్థలు, విద్యార్థులు భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్ల వంటి మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని విద్యా శాఖ స్పష్టంచేసింది. కనీస హాజరు తప్పనిసరిగా కాదని... ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు... పై తరగతులకు ప్రమోట్ చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్ బోధనతోనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆరు, ఏడు, ఎనిమిది తరగతులు ప్రారంభం కానున్నందున విద్యా శాఖ ప్రత్యేక సీఎస్ చిత్ర రామచంద్రన్, పాఠశాల విద్యా శాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సబితా సమీక్ష నిర్వహించారు. పాఠశాలల నిర్వహణలో కొవిడ్ మార్గదర్శకాల అమలులో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడవద్దని సబితా స్పష్టం చేశారు.
సీఎస్ టెలికాన్ఫరెన్స్
ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు బుధవారం నుంచి భౌతిక తరగతులు ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో... విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్లు, డీఈఓలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ అధికారులతో సీఎస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బుధవారం నుంచి వచ్చే నెల ఒకటో తేదీలోగా తరగతులు ప్రారంభించాలని సోమేశ్‌కుమార్ స్పష్టంచేశారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు 17 లక్షలా 24 వేల మంది విద్యార్థులున్నారని చెప్పారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షక కమిటీలు సమావేశమై... తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాలలను ప్రారంభిస్తున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఇదీ చదవండి :తెరాస నేతలతో రేపు కేటీఆర్ కీలక సమావేశం