- జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్నిచోట్ల ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి ఫోరం మాల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కారులో డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ భాజపాశ్రేణులకు నిరసన చేపట్టాయి. పువ్వాడ సెక్యూరిటీ సిబ్బంది కారును అడ్డుకునేందుకు యత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టారు.
- మియాపూర్ ఆదిత్యానగర్‌లో తెరాస, భాజపా మద్దతుదారుల మధ్య స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తెరాస శ్రేణులు డబ్బులు పంచుతున్నారని భాజపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నపోలీసులు వారిని చెదరగొట్టారు.
- జంగంమెట్‌లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎంఐఎం నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ భాజపా శ్రేణులకు ఆందోళనకు దిగాయి. దీంతో మజ్లిస్-భాజపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో... పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు. భారీగా ర్యాపిడ్ యాక్షన్ బలగాలను మోహరించారు. గచ్చిబౌలి డివిజన్‌లోనూ తెరాస-భాజపాశ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.
- తార్నాక డివిజన్‌లోని 136,139 పోలింగ్ బూత్‌లలో తెరాస శ్రేణులు అభ్యర్థి కూడిన కరపత్రాలతో ప్రచారంచేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్-తెరాస శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నిరసనకు దిగారు. పటాన్‌టెరు డివిజన్‌లో నర్సింగ్ అనే యువకుడితో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణవర్ధన్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారని భాజపాశ్రేణులు ఆరోపించాయి. పార్టీకండువా విషయంలో వివాదం నెలకొనడంతో పోలీసులు వచ్చి ఇరువర్గాలను చెదరగొట్టాయి.
- ముషీరాబాద్ పరిధిలోని అడిక్‌మేట్ డివిజన్‌లో తెరాస, భాజపా శ్రేణులు బాహాబాహీకి దిగాయి. తెరాస నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ భాజపా శ్రేణులు ఆందోళనకు దిగారు. బయటి వ్యక్తులకు డివిజన్‌లో పనేంటని నిలదీశారు . ఈ క్రమంలోనే మాటామాటా పెరిగి ఇరు వర్గాలు పోలీసుల సమక్షంలోనే పరస్పరం దాడులు చేసుకున్నాయి.
- జాంబాగ్ డివిజన్ తెరాస అభ్యర్థి ఆనంద్ గౌడ్ పై ఎంఐఎం నాయకులు దాడికి యత్నించారు. జూబ్లీ హైస్కూలు పోలింగ్ బూత్‌లో ఎంఐఎం నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారని ఆనంద్ గౌడ్ ఆందోళన చేపట్టారు. వారిని బూత్ ల నుండి బయటకు పంపాలని తెరాస అభ్యర్థి పోలీసులను కోరినా సహకరించడం లేదని ఆరోపించారు.
- కేపీహెచ్‌బీ కాలనీలో 58వ పోలింగ్ కేంద్రం, బోరబండ వీకర్ సెక్షన్ కాలనీ, జియాగూడ సంజయ్‌నగర్‌లోనూ తెరాస-భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌లో ప్రచారం చేస్తున్నారని... ఇరు పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటూ నిరసనకు దిగాయి. దీంతో పోలీసులు వచ్చి పరిస్థిని చక్కదిద్దారు.
- హైదరాబాద్ వనస్థలిపురం డివిజన్ పరిధిలోని 44వ పోలింగ్ కేంద్రంలో తెరాస ప్రచారం చేస్తోందని భాజపా అభ్యర్థి వెంకటేశ్వర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఆందోళనకు దిగారు. పోలింగ్ నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు.
బల్దియాలో పోలింగ్.. పార్టీల మధ్య ఫైటింగ్.. - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
బల్దియా పోరులో పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. డబ్బులు పంచుతున్నారంటూ తెరాస-భాజపా నేతలు కొన్ని డివిజన్లలో బాహాబాహీకి దిగగా... మరికొన్ని చోట్ల రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారంటూ.... తెరాస- భాజపా-ఎంఐఎం శ్రేణుల మధ్య గొడవలు జరిగాయి. ఉద్రిక్తతలు శ్రుతిమించకుండా పోలీసులు ఎక్కడికక్కడ పరిస్థితిని చక్కదిద్దారు.
clashes between political parties in ghmc elections 2020