Sabitha Indra reddy vs Theegala Krishna Reddy: మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇప్పటికే ఇద్దరు నేతల అభిమానులు వర్గాలుగా చీలిపోగా.. వారి మధ్య అంతర్గతంగా కుమ్ములాటలు జరుగుతున్నాయి. అయితే.. ఇన్ని రోజులు లోలోపలే నడిచిన అధిపత్య రాజకీయం.. ఇప్పుడు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి, తీగల కృష్ణారెడ్డి మధ్య కొంతకాలంగా విబేధాలు కనిపిస్తున్నాయి. సబితా ఇంద్రారెడ్డి తెరాసలో చేరినప్పటి నుంచి తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగానే ఉంటున్నారు. పార్టీలో చేర్చుకోవటమే కాకుండా మంత్రి పదవి కూడా కట్టబెట్టటంపై.. అధిష్ఠానంపై కృష్ణారెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్టు ఉండటం.. నియోజకవర్గంలోని కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోవటం.. ఇవన్నీ పరిణామాలతో కృష్ణారెడ్డి పార్టీ మారుతారనే సంకేతాలు బలంగా వచ్చాయి. అయితే.. కాంగ్రెస్లో చేరుతారని కొన్ని రోజులు.. భాజపాలో చేరతారని కొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఈ ప్రచారాలపై స్పందిస్తూ.. తాను పార్టీ మారడం లేదని తీగల కృష్ణారెడ్డి పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఇన్ని రోజులు సబితా ఇంద్రారెడ్డిపై ఉన్న అసమ్మతిని ఆయన ఇప్పుడు బహిరంగగానే వెలిబుచ్చారు. నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. సంచలన ఆరోపణలు చేశారు. తీగల కృష్ణారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెరాసలో చర్చనీయాంశమయ్యాయి.
"మీర్‌పేట్‌ను సబితా ఇంద్రారెడ్డి నాశనం చేస్తున్నారు. మీర్‌పేట నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోను. మా ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తా. సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారు. చెరువులు, పాఠశాలల స్థలాలను కూడా వదలడం లేదు. తమ పార్టీ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదు. అందుకే అభివృద్ధిని గాలికొదిలేశారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తిచేయలేదు. మంత్రి సబిత వైఖరిపై సీఎంతో మాట్లాడతా." - తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే