తెలంగాణ

telangana

ETV Bharat / city

CJI Justice NV Ramana AP Tour : 'ప్రధాన న్యాయమూర్తినైనా.. పొన్నవరం బిడ్డనే' - సొంతూరు పొన్నవరంలో సీజేఐ

CJI Justice NV Ramana AP Tour : బాజాభజంత్రీలు.. వేదాశీర్వచనాలు.. కోలాటాలు.. ఎడ్లబండిపై ఎదుర్కోలు.. రహదారికి ఇరువైపులా జాతీయపతాకాలు చేతబూనిన విద్యార్థులు, యువత, మహిళలు.. గ్రామగ్రామాన స్వాగత తోరణాలు.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యాక తొలిసారిగా స్వగ్రామం పొన్నవరం వచ్చిన జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణకు లభించిన ఘనస్వాగతమిది. ఏపీ సరిహద్దు నుంచే ఆయనకు జనం నీరాజనాలు పట్టారు. పౌరుల మధ్యే ఆయన సన్మానాలు స్వీకరించారు. వేదికపై కాకుండా గ్రామస్థులు, ప్రముఖుల దగ్గరకు వెళ్లి సత్కారం అందుకున్నారు. వారిని ఆత్మీయంగా పలకరించారు. స్వీయ చిత్రాలు దిగారు. సొంతూరు పొన్నవరం ప్రజలు, ఏపీ ప్రభుత్వం సీజేఐను ఘనంగా సత్కరించారు.

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, CJI AP tour
సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

By

Published : Dec 25, 2021, 8:30 AM IST

సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సొంతూరు పర్యటన

CJI Justice NV Ramana AP Tour : ఏపీ సరిహద్దు కృష్ణా జిల్లా గరికపాడు వద్ద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, శివమాల దంపతులకు ఘనస్వాగతం లభించింది. ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఏవీ రవీంద్రబాబు, లా సెక్రటరీ సునీత, నందిగామ అదనపు డిస్ట్రిక్ట్‌ జడ్జి బి.శ్రీనివాస్‌, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ కృతికా శుక్లా, జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌, ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఆయనకు స్వాగతం పలికారు.

Justice NV Ramana AP Tour : గరికపాడు వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుని ఆయన్ను స్వాగతిస్తూ నినాదాలు చేశారు. సీజేఐ దంపతులు అక్కడివారి సత్కారం స్వీకరించారు. అనంతరం చిల్లకల్లు, గౌరవరం, కొనకొంచి, నవాబుపేట బైపాస్‌, మునగచర్ల, అంబారుపేట, ఐతవరం గ్రామాల్లోనూ బారులు తీరి స్వాగతం పలికిన గ్రామస్థులను పలకరించారు. పలు ప్రాంతాల్లో విద్యార్థులు వెల్‌కం సీజేఐ అంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం 12.45కి పెరికలపాడు క్రాస్‌రోడ్డుకు చేరుకునేసరికి పెద్దఎత్తున ప్రజలు గుమికూడారు. అక్కడే విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకొళ్ల నారాయణ స్వాగతం పలికారు. పొన్నవరం గ్రామ ముఖద్వారం వద్ద గ్రామస్థులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులను అందంగా అలంకరించిన ఎడ్లబండిపై ఎక్కించి.. బాజాభజంత్రీలు, మహిళల కోలాటాల సందడి మధ్య సగౌరవంగా గ్రామంలోకి తోడ్కొని వచ్చారు. తొలుత గ్రామంలోని శివాలయంలో జస్టిస్‌ ఎన్‌.వి.రమణ దంపతులు పూజలు చేశారు. అనంతరం తన సోదరుడు నూతలపాటి వీరనారాయణ నివాసానికి వెళ్లి బంధుమిత్రులను కలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ కలిశారు. పలువురు న్యాయమూర్తులు మర్యాదపూర్వకంగా సీజేఐతో భేటీ అయ్యారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నివాసం నుంచి నడుచుకుంటూ.. మధ్యాహ్నం 1.30 గంటలకు పౌరసన్మాన వేదిక వద్దకు చేరుకున్నారు. విజయవాడకు చెందిన కళాకారుల బృందం భరతనాట్యంతో ఆయనకు స్వాగతం పలికారు. వేదికపై సన్మానాలు వద్దంటూ వారించిన సీజేఐ కిందకు వచ్చి న్యాయమూర్తులు, అధికారులు, ప్రముఖులను పరిచయం చేసుకుంటూ వారి సత్కారాలను స్వీకరించారు.

ఘనంగా పౌర సన్మానం..

CJI Justice NV Ramana AP Tour First Day : తెలుగుజాతి గౌరవ, ప్రతిష్ఠలు ఇనుమడించేలా వ్యవహరిస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ స్పష్టం చేశారు. దిల్లీకి రాజయినా తల్లికి బిడ్డే అన్నట్లు.. తాను ప్రధాన న్యాయమూర్తినయినా పొన్నవరం బిడ్డనేనని చెప్పారు. తాను దిల్లీలో సమావేశాలకు వెళితే.. తెలుగువారి గురించి పలువురు ప్రస్తావిస్తుంటారని చెప్పారు.

CJI Visits His Village in AP : విభిన్న రంగాల్లో ఎంతోమంది తెలుగు జాతి ఘనతను చాటిచెప్పారని గుర్తు చేశారు. పొన్నవరంలో గ్రామస్థులు ఏర్పాటు చేసిన పౌరసన్మాన సభలో ఆయన ప్రసంగించారు. తాను ప్రసంగాలు, సన్మానాల కంటే పరిచయస్తులను కలిసేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అన్నారు. గ్రామాన్ని వదిలిపెట్టి చాలాకాలమైనా.. నా మూలాలు ఇక్కడే ఉన్న విషయం ఏనాడూ మరవలేదు. పొన్నవరం గ్రామస్థుల ఆదరాభిమానాలతోనే ఈ స్థాయికి చేరుకున్నాను. మా తాత సేవాభావం, నాన్న అభ్యుదయభావాలు నాకు అబ్బాయి. అక్క, పెద్దమ్మ, పెదనాన్న నన్ను పెంచారు. అయిదుగురు తోబుట్టువులతో కలిసి పెరిగాను. రాజు మాస్టారి వీధి బడిలో చదివాను. ఇప్పటిలా ఏసీలు కాదు కదా ఫ్యాన్లు కూడా లేవు. అరుగుమీద బెత్తం పట్టుకుని పాఠాలు చెప్పేవారు. ఏనాడూ ఆయన చేతిలో దెబ్బలు తిన్నట్లు గుర్తులేదు. బహుశా సన్నగా, పీలగా ఉండటం వల్ల నన్ను కొట్టకపోయి ఉండవచ్చు’ అంటూ చిన్ననాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

తెలుగువారు ఎంతోమంది వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్నా తెలుగు జాతికి సరైన గుర్తింపు లేదనే వేదన నాలో ఉంది. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలి. పొన్నవరం గ్రామస్థులు నా తల్లిదండ్రుల్లాంటివారు. మీ అందరి ముందు పుట్టి పెరిగాను. మీ ఆదరాభిమానాలతో ఈ స్థాయికి చేరుకున్నాను. మీ ఆశీర్వచనాల కోసం వచ్చాను.

- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, సీజేఐ

ఎన్నికల వరకే రాజకీయాలు

CJI Visits Ponnavaram : ‘నందిగామ ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఎక్కువ. నాడు మూడు పార్టీలు ఉండేవి. ఎన్ని పార్టీలున్నా ఘర్షణలు జరిగేవి కావు. రాజకీయాలు ఎన్నికల వరకే. ఆ తర్వాత ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడూ అలాగే ఉండాలని ఆకాంక్షిస్తున్నా. మా నాన్న గణపతిరావు కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు. ఒకసారి ఆయన తమ మద్దతుదారులతో సమావేశమయ్యారు. నేను స్వతంత్ర పార్టీ జెండాతో కమ్యూనిస్టు పార్టీ డౌన్‌డౌన్‌ అని నినాదాలు చేశాను’ అని వివరించారు. ‘నాకు శివలింగప్రసాద్‌ అని బాల్యమిత్రుడు ఉండేవారు. ఇటీవల కాలం చేశారు. చింతమనేని సత్యవతమ్మ ఉండేవారు. ఆమె భర్త రంగా గారి శిష్యుడు. కంచికచర్లలో రంగా గారి సభ జరుగుతుంటే ఆమె వెళ్లమని ప్రోత్సహించారు. ఆమె స్ఫూర్తితోనే రాజకీయాలంటే ఆసక్తి ఏర్పడింది’.

జస్టిస్ ఎన్వీ రమణ, సీజేఐ

రైతు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగారు

CJI AP Tour Updates : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రసంగిస్తూ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అత్యున్నత పదవిని అలంకరించడం అరుదైన విషయమని కొనియాడారు. దేశానికి వన్నె తెచ్చే విధంగా పనిచేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజేలు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, న్యాయమూర్తులు జస్టిస్‌ కృష్ణప్రసాద్‌, జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ లలిత, జస్టిస్‌ జయసూర్య, జస్టిస్‌ కృష్ణమోహన్‌, జస్టిస్‌ దేవానంద్‌, మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్‌, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌, గ్రామ సర్పంచి రాజశ్రీ హాజరయ్యారు. గ్రామస్థులు, అధికారులు, పలువురు ప్రముఖులు జస్టిస్‌ ఎన్‌.వి.రమణను ఘనంగా సన్మానించారు.

సమస్యలపై సమష్టిగా పోరాడాలి

‘నందిగామ మెట్టప్రాంతం. అంతా దుర్భిక్షం. నీళ్లు దొరికేవి కావు. గ్రామాల్లో ఏదడిగినా ఇచ్చేవారు కానీ నీళ్లిచ్చేవారు కాదు. నాడు మా తాతగారు తవ్విన బావి.. బాపయ్య కుంట ఇప్పటికీ ప్రసిద్ధి. తర్వాత సాగర్‌ కాలువ వచ్చినా దుర్భిక్షం తగ్గలేదు. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర దక్కడం లేదు. భూసమస్యలు ఉన్నాయి. నందిగామ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందలేదనే ఆవేదన నాలో ఉంది. దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళుతున్నాయి. సమస్యలూ అదే స్థాయిలో ఉన్నాయి. సమస్యలపై సమష్టిగా పోరాడాలి’ అని సీజేఐ సూచించారు. ‘ఎంతోమంది తెలుగు జాతి ఘనతను చాటి చెప్పారు. టెర్రరిస్టుల అరాచకాల మధ్య అఫ్గానిస్తాన్‌ పార్లమెంటు భవనం నిర్మించింది తెలుగువారే. ఇక్కడి నిర్మాణ సంస్థలు దేశవిదేశాల్లో ప్రతిష్ఠాత్మక నిర్మాణాలు చేశాయి. కరోనా సమయంలో టీకాను అభివృధ్ధి చేసిన భారత్‌ బయోటెక్‌కు చెందిన కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల తెలుగువారు కావడం గర్వకారణం’ అన్నారు. ‘గ్రామానికి రావాలని మా సోదరుడు వీరనారాయణ కొన్ని రోజులుగా కోరుతున్నారు. అందుకే వచ్చాను. నాకు అపూర్వ స్వాగత, సత్కారాలు ఏర్పాటు చేసిన గ్రామస్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్ది రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు’ అంటూ ముగించారు.

దిల్లీలో ఆయన ఇంటిముందు తెలుగులోనే పేరు

న్మాన సభకు అధ్యక్షత వహించిన మాజీ ఉపసభాపతి, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ సీజేఐతో తనకు భాషా సంబంధం ఉందన్నారు. ఆయన మాతృభాషాభిమాని అంటూ కొనియాడారు. దిల్లీలో ఆయన భవనం ముందు తెలుగులో నామఫలకం ఉంటుందన్నారు. భారతావనికి ఆణిముత్యాన్ని అందించిన పొన్నవరాన్ని ప్రశంసించారు.

ఆత్మీయ స్వాగతం పలికి, విందు ఇచ్చిన జస్టిస్ లావు నాగేశ్వరరావు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా పెదనందిపాడులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు గ్రామస్థులు, జిల్లా యంత్రాంగం ఘనస్వాగతం పలికారు. శుక్రవారం రాత్రి 10.48 గంటలకు తమ నివాసానికి వచ్చిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, శివమాల దంపతులకు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కుటుంబసభ్యులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆయన కుటుంబీకులను ప్రధాన న్యాయమూర్తికి పరిచయం చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్జిస్‌ సతీష్‌చంద్ర శర్మ దంపతులు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర దంపతులు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాజేష్‌ గోయల్‌, సూర్యదేవర ప్రసన్నకుమార్‌, ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రవీంద్రబాబు, రిజిస్ట్రార్‌ లక్ష్మణరావు, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ పి.శ్రీధర్‌రావు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఛైర్మన్‌ లావు రత్తయ్య తదితరులు హాజరయ్యారు. పరిచయాలు, పలకరింపుల అనంతరం విందు జరిగింది. అనంతరం సీజేఐ విజయవాడలోని నోవాటెల్‌ హోటల్‌కు వెళ్లారు. స్వాగత ఏర్పాట్లు, అధికార యంత్రాంగం రాకపోకలతో ఉదయం నుంచే పెదనందిపాడులో సందడి నెలకొంది.

బంధువులతో కలిసి విందు

స్టిస్‌ ఎన్‌.వి.రమణ శుక్రవారం మధ్యాహ్నం సోదరుడు నూతలపాటి వీరనారాయణ నివాసంలో బంధువులతో కలిసి మధ్నాహ్నం భోజనం చేశారు. అతి కొద్దిమంది సన్నిహితులను మాత్రమే అక్కడ కలిసి, సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి విజయవాడ వచ్చారు. సీజేఐ రాక సందర్భంగా గ్రామస్థులకు విందు భోజనం ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details