దిశ నిందితుల ఎన్‌కౌంటర్ విచారణను ఎందుకు సాగదీస్తున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ ప్రశ్నించారు. జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ విచారణ గడువు పొడిగింపు పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుటకు మంగళవారం వచ్చింది. గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించాలని ధర్మాసనానికి కమిషన్ తరఫు న్యాయవాది కె.పరమేశ్వర్ విజ్ఞప్తి చేశారు. సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ జోక్యం చేసుకుంటూ.. ‘‘విచారణను మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయొచ్చు. ఈ విషయంలో 130 నుంచి 140 మందిని విచారించాల్సిన అవసరం ఉందా?’’ అని ప్రశ్నించారు.
కొవిడ్ మహమ్మారి ప్రభావంతో కమిషన్ విచారణ పూర్తి చేయలేకపోయిందని న్యాయవాది తెలిపారు. ‘‘ఉత్తర్‌ప్రదేశ్ ఘటనపై విచారణ పూర్తయింది. ఆ కమిషన్ (యూపీ గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే ఎన్‌కౌంటర్‌పై నియమించిన జస్టిస్ చౌహాన్ కమిషన్) నివేదిక కూడా సమర్పించింది’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. గడువు పొడిగింపు కోరడం ఇది మూడోసారని, ఇదే ఆఖరి అవకాశం అయ్యేలా చూడాలని పిటిషనర్లుగా ఉన్న న్యాయవాదులు జి.ఎస్.మణి, ప్రదీప్‌కుమార్ యాదవ్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న సీజేఐ.. కమిషన్ తన తుది నివేదిక సమర్పించేందుకు గడువును నేటి నుంచి ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపారు.