తెలంగాణ

telangana

ETV Bharat / city

CJI justice NV Ramana on TTD: శ్రీవారిసేవల్లో తప్పులు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై ఏం చేశారు? - ఏపీ తాజా వార్తలు

శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్యకైంకర్యాల్లో తప్పులు జరుగుతున్నాయంటూ ఓ భక్తుడు ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో వారం రోజుల్లోగా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ (CJI justice NV Ramana) నేతృత్వంలోని ధర్మాసనం తితిదేను (TTD) ఆదేశించింది.

CJI justice NV Ramana on TTD
CJI justice NV Ramana on TTD

By

Published : Sep 30, 2021, 8:20 AM IST

శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్యకైంకర్యాల్లో తప్పులు జరుగుతున్నాయంటూ ఓ భక్తుడు ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్యలు తీసుకున్నారో వారం రోజుల్లోగా చెప్పాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ (CJI justice NV Ramana) నేతృత్వంలోని ధర్మాసనం తితిదేను (TTD) ఆదేశించింది. ఈ అంశంపై తన పిటిషన్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ శ్రీవారి దాదా అనే భక్తుడు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీపై జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తాను వేంకటేశ్వరస్వామి భక్తుడినని, వైష్ణవ ఆలయాలపై పరిశోధనలు చేశానంటూ పిటిషనరే వ్యక్తిగతంగా వాదనలు వినిపించారు.

‘ఆలయంలో ఆగమశాస్త్ర విరుద్ధంగా చేస్తున్న నగ్నఅభిషేకాలు, అసంబద్ధమైన ఆర్జిత సేవలు, దర్శనాలను నిలువరించాలి. నా వాదనలను ఓపిగ్గా వినండి’ అని కోరారు. జస్టిస్‌ రమణ కల్పించుకుంటూ ‘మీరు బాలాజీ భక్తులే కదా. భక్తులకు ఓర్పు ఉండాలి. కానీ మీకది లేదు. ముందు మీరు మారాలి. తితిదే పవిత్రతను కాపాడాలన్న తాపత్రయం మాకూ ఉంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేసి, దాన్ని విచారణకు స్వీకరించాలంటూ రోజూ రిజిస్ట్రీని బ్లాక్‌మెయిల్‌ చేయడమేంటి? చనిపోతానంటూ బెదిరించడమేంటి? ఇందులో అంత అత్యవసరమేముంది? కైంకర్యాల విషయంలో ఏ చట్టం కింద కోర్టులు జోక్యం చేసుకోవచ్చు? మీ ఇష్టానుసారం చెప్పడానికి ఇదేమి కచేరీ కోర్టుకాదు. మీ హక్కులకు ఎక్కడ ఉల్లంఘన జరిగిందో చెప్పండి’ అని ప్రశ్నించారు. ప్రాథమిక హక్కులకు భంగం కల్గుతోందని పిటిషనర్‌ చెప్పగా ‘ఏ ప్రాథమిక హక్కో చెప్పండి. పూజ ఎలా చేయాలి, ఎంతమందిని అనుమతించాలన్నది ప్రాథమిక హక్కా?’ అని జస్టిస్‌ రమణ ప్రశ్నించారు.

తీసుకున్న చర్యలేంటో చెప్పండి

అనంతరం సీజేఐ తితిదే తరఫు న్యాయవాదిని పిలిచి పిటిషనర్‌ 2020 మార్చి 28న తితిదేకు ఇచ్చిన వినతిపత్రంపై మీరేం చర్య తీసుకున్నారో చెప్పండని ఆదేశించారు. వ్యాజ్యంలోని అంశాలపై న్యాయవాది అభ్యంతరం చెప్పబోగా.. ‘ప్రస్తుతానికి ఆ విషయాలు పక్కనపెట్టండి. అతని ఫిర్యాదుపై మీరు తీసుకున్న చర్యలేంటో చెప్పండి. నాతో సహా.. ధర్మాసనంలోని న్యాయమూర్తులిద్దరూ స్వామి భక్తులే. సంప్రదాయాల ప్రకారమే దేవస్థానం పూజాదికాలు కొనసాగిస్తుందని మేం ఆశిస్తాం’ అని పేర్కొన్నారు. అన్ని పూజలూ ఆగమశాస్త్రం ప్రకారమే చేస్తున్నారని తితిదే న్యాయవాది చెప్పగా.. తొలుత పిటిషనర్‌ ఇచ్చిన వినతిపత్రంపై ఏం చర్య తీసుకున్నారో చెప్పండంటూ న్యాయమూర్తి మళ్లీ గుర్తుచేశారు. అందుకు వారం రోజుల గడువు కావాలని న్యాయవాది కోరగా, సీజేఐ అంగీకరించారు.

తెలుగులో సంభాషణ

పిటిషనర్‌ పేరు శ్రీవారి దాదా అని ఉండడంపై ‘మీ అసలు పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని సీజేఐ ప్రశ్నించారు. తనది ప్రకాశం జిల్లా అని, తెలుగు వచ్చంటూ ఆయన బదులిచ్చారు. దీంతో సీజేఐ తెలుగులోనే మాట్లాడారు. తన పేరు ‘శ్రీవారి దాసాని దాసులు’ అని పిటిషనర్‌ చెప్పగా.. అలా చెప్పొచ్చు కదా, ఏదో ‘దాదా’లా చెబుతున్నారంటూ సీజేఐ సరదాగా వ్యాఖ్యానించారు. అధికారిక రిజిస్టర్‌లో తనపేరు శ్రీవారి దాదాగా ఉందని పిటిషనర్‌ విన్నవించారు. తర్వాత ధర్మాసనం ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేసేందుకు ఉత్తర్వులు ఇవ్వబోగా, పిటిషనర్‌ తన వాదనలను కొనసాగించే ప్రయత్నంచేశారు. ‘ఈ కేసు డిస్మిస్‌ చేయమంటారా? మీ ఫిర్యాదుపై తితిదే స్పందన తెలిపేందుకు వారం రోజులు ఆగలేరా?’ అంటూ జస్టిస్‌ రమణ ఆగ్రహించారు. అయినా పిటిషనర్‌ పదేపదే వివిధ అంశాలు ప్రస్తావించబోగా.. ‘తప్పుచేస్తే దేవుడు అందర్నీ శిక్షిస్తాడు. ఊరుకోడు. పూజలు ఎలా చేయాలన్నది తితిదే చూసుకుంటుంది. అవకాశం ఇచ్చాం కదా.. అని మీరు ఎక్కువ మాట్లాడొద్దు’ అని జస్టిస్‌ రమణ ఆగ్రహం వ్యక్తంచేస్తూ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేశారు.

ABOUT THE AUTHOR

...view details