యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో మరోసారి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. సివిల్ సర్వీసెస్‌కు దేశవ్యాప్తంగా మొత్తం 685 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యశ్వంత్ కుమార్... 15వ ర్యాంకుతో అత్యుత్తమంగా నిలిచారు. పూసపాటి సాహిత్య 24వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. హనుమకొండకు చెందిన బి.చైతన్య రెడ్డికి సివిల్స్‌లో 161వ ర్యాంకు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన విద్యమారి శ్రీధర్ 336వ ర్యాంకు సాధించారు. ఆరో ప్రయత్నంలో సివిల్స్‌లో విజయం సాధించినట్లు శ్రీధర్ తెలిపారు. రాష్ట్రానికి చెందిన శరత్ నాయక్‌కు 374వ ర్యాంకు వచ్చింది. శరత్ తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించారు. ఐదేళ్లు సన్నద్ధత తర్వాత సివిల్స్ పరీక్ష రాసి సత్తా చాటారు.
''ఇవాళ యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో నాకు 336 ర్యాంకు వచ్చింది. ఇదంతా మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే... తర్వాత మా టీచర్స్. చాలా ఆనందంగా ఉంది. మా అమ్మనాన్న కల నేరవేరింది. వారి సపోర్ట్ వల్లే ఇది సాధ్యమైంది.'' - విద్యమారి శ్రీధర్, 336 సివిల్స్ ర్యాంకర్
''మా నాన్న గారు రైతు. మా అమ్మ అంగన్వాడీ టీచర్. నేను వెటర్నరీ డాక్టర్. ఇది నా తొలి ప్రయత్నం. నా ర్యాంకు 374. నేను 8వ తరగతిలో ఉన్నప్పుడు నేను ఐఏఎస్ కావాలి అనుకున్నా... నేను 5 సంవత్సరాలుగా ప్రిపేర్ అయ్యాను. ప్రిలిమ్స్ ఒకటి కష్టమని అనిపించింది. హర్డ్ వర్క్ ముఖ్యం. నాలుగేళ్ల క్రితం రోజూ... 5 నుంచి 6 గంటలు చదివాను. ఐఏఎస్ వస్తే.. ఆపేస్తాను. రాకపోతే.. మళ్లీ రాస్తాను.''-గుగులావత్ శరత్ నాయక్, 374 సివిల్స్ ర్యాంకర్
నాగర్‌కర్నూల్ జిల్లా వాసి సంతోష్‌కుమార్‌రెడ్డికి సివిల్స్-2021లో 488వ ర్యాంకు వచ్చింది. వరంగల్‌కు చెందిన రంజిత్ కుమార్‌కు 574వ ర్యాంకు సాధించారు. మూడో ప్రయత్నంలో సివిల్స్‌లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా వాసి సాయిప్రకాశ్‌కు సివిల్స్‌లో 650వ ర్యాంకు వచ్చింది. అపజయాల నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకుని... ప్రణాళికబద్ధంగా సిద్ధమైనట్లు విజేతలు చెబుతున్నారు.
''మాది వరంగల్ జిల్లా.. నేను మూడవ ప్రయత్నంలో సివిల్స్‌లో ర్యాంకు కొట్టగలిగాను. మొదటి సారి నేను క్వాలిఫై కాలేదు. రెండో సారి ఇంటర్య్యూ వరకు వెళ్లాను. మూడవ ప్రయత్నంలో సివిల్స్‌లో 574వ ర్యాంకు సాధించాను. ఫెయిల్ అయినప్పుడు.. కొన్ని తప్పులు కనిపించాయి. వాటిని నేను అధిగమించి.. ఈసారి ర్యాంకు సాధించగలిగాను. మా మెంటర్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల్లో.. మూడు ఒకటే.. కానీ చదివే విధానం వేరు. నేను 8 గంటలు కచ్చితంగా చదివేవాడిని. ఒక ప్రణాళిక బద్ధంగా చదివాను. అందుకే ఇది సాధ్యమైంది.'' -రంజిత్ కుమార్, 574 సివిల్స్ ర్యాంకర్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు విద్యార్థులు సివిల్స్‌లో సత్తా చాటారు. నర్సీపట్నానికి చెందిన మంత్రి మౌర్య భరద్వాజ్.. సివిల్స్ లో 28వ ర్యాంకుతో సత్తా చాటారు. ఐదో ప్రయత్నంలో సివిల్స్‌లో 28వ ర్యాంకు సాధించారు. పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంకు వచ్చింది. కొప్పిశెట్టి కిరణ్మయి 56, కడప జిల్లాకు చెందిన తిరుమణి శ్రీపూజ 62, గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి 69వ ర్యాంకులు వచ్చాయి. చిత్తూరు జిల్లావాసి మాలెంపాటి అమిత్ నారాయణకు 70వ ర్యాంకు వచ్చింది. ఆకునూరి నరేశ్.. 117, బొక్కా చైతన్యరెడ్డికి 161, ఆకవరం సస్యారెడ్డికి 214, ఎస్. కపిలేశ్వరరావుకు 297, నల్లమోతు బాలకృష్ణ 420, ఎన్. సంతోష్‌కుమార్‌రెడ్డి.. 488, ఉప్పులూరు చైతన్యకు 470వ ర్యాంకులు వచ్చాయి.