రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2020-21 వానాకాలం మార్కెటింగ్ సీజన్‌లో భాగంగా ధాన్యం సేకరణ సంబంధించి హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని తన కార్యాలయంలో రైస్ మిల్లర్లు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఇటీవల కురిసిన వర్షాలతో వరి సన్న రకాలకు దోమపోటుతో రంగు మారిన ధాన్యం కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. తాలు, మట్టి పెళ్లలు లేకుండా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు సన్నరకం వరి సాగు చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా 6491 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పౌరసరఫరాల శాఖ... ఇప్పటి వరకు 3074 కేంద్రాలు తెరిచి 4.23 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు మంత్రి వివరించారు. ఇప్పటి వరకు 93 వేల మెట్రిక్ టన్నుల సన్నరకాలు, 3.30 మెట్రిక్ టన్నుల దొడ్డు రకాలను కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. ఈ ఏడాది వానాకాలం గణనీయమైన పంట దిగుబడులకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున రైస్ మిల్లర్లు అందుకు సహకరించాలని మంత్రి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మిల్లర్లు సమస్యలు సర్కారు పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.