తెలంగాణ

telangana

ETV Bharat / city

కార్యాలయాల్లో కరోనా పడగ... పౌర సేవలకు అంతరాయం - పౌర సేవలపై కరోనా ప్రభావం

ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా పడగ కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులు వైరస్ బారినపడటంతో పౌరసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. కార్యాలయాలకు ఎవరూ రావద్దని, వినతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెట్టెల్లో వేయాలని అధికారులు సూచిస్తున్నారు.

CORONAVIRUS
CORONAVIRUS

By

Published : Aug 31, 2020, 7:07 AM IST

ప్రభుత్వ కార్యాలయాలు, పౌరసేవలపై కరోనా ప్రభావం చూపుతోంది. క్షేత్రస్థాయి ఉద్యోగులు, పౌరసేవల్లో నేరుగా పాల్గొంటున్నవారు అత్యధికంగా కొవిడ్‌ ప్రభావానికి గురవుతున్నారు. జిల్లా పాలనాధికారుల నుంచి పలువురు జిల్లా, మండల అధికారుల వరకు కరోనా బారినపడి కోలుకుని విధులకు హాజరవుతున్నారు. ప్రజలతో ముడిపడి ఉన్న కీలక శాఖల్లో సిబ్బంది అనారోగ్యం బారిన పడుతుండడంతో సేవలకు ఇబ్బంది కలుగుతోందని అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపైనా కరోనా పడగ కొనసాగుతోంది. కార్యాలయాలకు ఎవరూ రావద్దని, వినతులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెట్టెల్లో వేయాలని అధికారులు సూచిస్తున్నారు.

  • నాగర్‌కర్నూల్‌ తహసీల్దార్‌ కార్యాలయం నాలుగు రోజులు మూతపడింది. మహబూబాబాద్‌ వ్యవసాయశాఖ కార్యాలయంలో ఒకరికి కరోనా రాగా రెండు రోజులు మూతపడింది.
  • కరీంనగర్‌ నగరపాలకసంస్థలో 11 మందికి కొవిడ్‌ సోకింది. కరీంనగర్‌లో వ్యవసాయ శాఖ, సహకారశాఖలో ఉద్యోగులు కొందరు కరోనాతో ఇబ్బంది పడ్డారు. పెద్దపల్లి ఆర్‌డీఓ కార్యాలయంలో ఉన్నతాధికారితో పాటు జిల్లాలో కొందరు తహసీల్దార్‌లు, వీఆర్వోలు ఇతర ఉద్యోగులు కరోనా ప్రభావానికి గురైనవారిలో ఉన్నారు.
  • వరంగల్‌ కార్పొరేషన్‌లో ఇప్పటి వరకూ సుమారు 37 మంది వ్యాధి బారిన పడగా పలువురు కోలుకున్నారు.
  • నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో పురపాలక సిబ్బందితో పాటు, పట్టణ ప్రణాళికా విభాగం, ఇతర విభాగాల్లో పది మంది కరోనాతో ఇబ్బందిపడి కోలుకున్నారు.
  • రామగుండం కార్పొరేషన్‌లో సుమారు ఐదుగురు ఉద్యోగులు కొవిడ్‌-19 బారిన పడి కోలుకున్నారు. పురపాలక కమిషనర్లు, పలు చోట్ల ఖజానా కార్యాలయాలు, ఆదిలాబాద్‌ కలెక్టరేట్‌ సహా జిల్లా పరిషత్‌, జిల్లా పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగులు కరోనాతో ఇబ్బందిపడ్డారు.
  • పూర్వపు కరీంనగర్‌ జిల్లాలోని ఒక పురపాలక సంఘంలో మొదట టౌన్‌ప్లానింగ్‌ విభాగంలో నలుగురికి పాజిటివ్‌ రాగా రెండో దశలో కమిషనర్‌తో పాటు డీఈ, పారిశుద్ధ్య సిబ్బందికి కలిపి 15 మందికి కరోనా వచ్చింది. వంతులవారీగా విధులకు హాజరవుతున్నారు.
  • పూర్వపు మెదక్‌ జిల్లాలో ఒక తహసీల్దార్‌ కార్యాయంలో ఎనిమిది మంది ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడటం గమనార్హం.
  • ఆర్మూర్‌ మున్సిపాలిటీలో ఏడుగురు కరోనాతో సతమతమయ్యారు. కమిషనర్‌తో పాటు ఇద్దరు డేటా ఎంట్రీ ఆపరేటర్లకు పాజిటివ్‌ వచ్చింది.

రిజిస్ట్రేషన్లకు కొవిడ్‌ తాకిడి

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు తాకిడి బాగా పెరిగింది. జాగ్రత్తలు తీసుకుంటూనే సబ్‌రిజిస్రార్లు, సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. సబ్‌రిజిస్ట్రార్లకు కరోనా సోకితే తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లకు ఇబ్బంది కలుగుతోంది. నాగర్‌ కర్నూల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం రెండు రోజులు మూతపడి తర్వాత తెరుచుకుంది.

ABOUT THE AUTHOR

...view details