మహిళల భద్రతపై సర్కార్ ఫోకస్.. హైదరాబాద్లో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. - Home Minister Mahmood Ali

19:49 June 09
మహిళల భద్రతపై సర్కార్ ఫోకస్.. హైదరాబాద్లో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..
Home Minister Mahmood Ali Review: రాష్ట్రంలో సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం కేసు.. ఆ ఘటన తర్వాత వరసుగా వెలుగులోకి వస్తోన్న అఘాయిత్యాలతో హోంశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే.. మహిళల భద్రతపై పోలీస్ ఉన్నతాధికారులతో హోంమంత్రి మహమూద్ అలీ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో.. డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తాతో పాటు సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్, స్టీఫెన్ రవీంద్ర పాల్గొన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలను నిరోధించడానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని హోంమంత్రి తెలిపారు. హైదరాబాద్లో పబ్ల అనుమతులు, నిర్వహణపై సిటీ పోలీస్ యాక్ట్ అమలు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ - పోలీస్ శాఖతో సమన్వయ సమావేశం నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
నగరంలోని జనసమర్థ ప్రాంతాల్లో మరింత నిఘా పెంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని హోంమంత్రి తెలిపారు. మహిళ భద్రతా విభాగం, షీటీమ్ ఆధ్వర్యంలో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తల్లిదండ్రులు, విద్యా సంస్థల్లో షీటీమ్ ఆధ్వర్యంలో అవగాహన పెంచుతామన్నారు. పార్టీల పేరుతో పబ్లు, ఇతర కార్యక్రమాలకు వెళ్లే అమ్మాయిలు ప్రలోభాలకు గురికాకుండా.. సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలో శాంతిభద్రల పర్యవేక్షణ కోసం సిటీ పోలీసు యాక్ట్ పక్కాగా అమలు చేస్తామన్నారు.
ఇవీ చూడండి: