కరోనాపై పోరాటంలో అన్ని పారిశ్రామిక నైపుణ్య శిక్షణ సంస్థలు భాగస్వాములు కావాలని కేంద్రం ఆదేశించగా... పలు సంస్థలు ముందుకొచ్చాయి. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని 18 ఆపరేషనల్ టెక్నాలజీ సెంటర్లు, స్వయంప్రతిపత్తి సంస్థలు (అటానమస్ బాడీలు) వివిధ స్థాయిలో సన్నద్ధం అవుతున్నాయి.
ఎలక్ట్రోమెకానికల్ వెంటిలేటర్ నమూనా రూపొందిస్తున్న సీఐటీడీ - CITD
కరోనా బాధితుల కోసం అత్యాధునిక ఎలక్ట్రో మెకానికల్ వెంటిలేటర్ నమూనా రూపొందించేందుకు హైదరాబాద్‌లోని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖకు చెందిన పరికరాల ఆకృతి కేంద్రీయ సంస్థ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రయోగం తుది దశలో ఉంది. పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత అన్ని రకాల అనుమతులు తీసుకొని త్వరలో విడుదల చేయాలని సీఐటీడీ యోచిస్తోంది.
ఎంఎస్‌ఎంఈ భువనేశ్వర్, జంషెడ్‌పూర్ టెక్నాలజీ సెంటర్లు కరోనా పరీక్ష కిట్ల భాగాలు తయారు చేస్తున్నాయి. హైదరాబాద్ సీఐటీడీ నిపుణులు చౌక, ఆధునిక వెంటిలేటర్ నమూనా రూపకల్పనపై దృష్టి సారించారు. ప్రస్తుతం వెంటిలేటర్లు మాన్యువల్‌గా నడుస్తున్నాయి. సీఐటీడీ రూపొందిస్తున్న నమూనాను సెన్సర్ ఆధారంగా దూరం నుంచి కూడా నిర్వహించే వీలుంది.
తుది నమూనా ఆమోదం పొందితే.. దాని ఆధారంగా పరిశ్రమలు ఉత్పత్తి చేపడతాయి. తాము రూపొందిస్తున్న నమూనా సరళంగా, చౌకగా ఉంటుందని.. దీన్ని రూ. 5500 నుంచి రూ. 6 వేలకే అందుబాటులో ఉండేలా చేయాలన్నది తమ సంకల్పమని సీఐటీడీ డైరెక్టర్ ప్రభు పేర్కొన్నారు.