Thammareddy Bharadwaj: సినీ పరిశ్రమపై ఏపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌ఛాంబర్‌లో మాట్లాడిన ఆయన.. సినీ పరిశ్రమను నిందిస్తున్న నాయకులు తలదించుకోవాలన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఉపాధి కల్పించేది సినీ పరిశ్రమేనని తేల్చి చెప్పారు. సామాజిక వర్గాల పేరుతో రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు ఎంత తింటున్నారో బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. రూ.కోట్లు పెట్టి పైసాపైసా ఏరుకుంటున్నామన్న ఆయన.. రాజకీయ నాయకులు మాత్రం రూపాయి పెట్టి కోట్లు కొల్లగొడుతున్నారంటూ ధ్వజమెత్తారు.
వైకాపా ఎమ్మెల్యే ఏం అన్నారంటే..
సినిమా వాళ్ల పొట్టకొడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సోమవారం ఆసక్తికర కామెంట్స్ చేశారు. పేదవాళ్లకు అందుబాటులో ఉండేలా సినిమా టికేట్ల ధరలు తగ్గిస్తే తప్పేంటని ప్రశ్నించారు. "సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ ఉందని గుర్తుందా..? సినిమా వాళ్ల పొట్ట కొట్టామంటున్నారు చంద్రబాబు.. మరి పెద్దహీరోల సినిమాలు వస్తే భారీ ధరలకు బ్లాక్‌లో టికెట్లు అమ్మటం గురించి మాట్లాడరెందుకు..? తొమ్మిదేళ్లు ఉమ్మడి రాష్ట్రంలో, ఐదేళ్లు ఏపీలో సీఎంగా ఉన్నా.. సినిమా టికెట్ల విషయం పట్టించుకోలేదు. మీ కమ్యూనిటీ వాళ్లు సినిమాల్లో ఉన్నారు కాబట్టే.. మద్దతు ఇచ్చి వాళ్లు బలిసేలా చేశావు." అంటూ విమర్శలు చేశారు. వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి తీవ్రంగా స్పందించారు.