సినీనటుడు, విశ్లేషకుడు కత్తి మహేశ్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఏపీ నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో మహేశ్ వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.
ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నా... తల భాగంలో మహేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయన్ని నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఎడమ కంటికి తీవ్రగాయమైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. మహేశ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.