TDP Youtuber Arrest in AP : ఏపీలోని పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు గార్లపాటి వెంకటేశ్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, వైకాపా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో అర్ధరాత్రి వెంకటేశ్ నివాసానికి చేరుకున్నారు. స్థానిక పోలీసుల సహకారంతో గడ్డపారతో తలుపులు పగలగొట్టి లోపలకి ప్రవేశించారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన అధికారులను వెంకటేశ్ అడ్డుకున్నారు.
గునపంతో తలుపులు పగులగొట్టి.. తెదేపా యూట్యూబర్ అరెస్టు! - ఏపీలో తెదేపా యూట్యూబర్ అరెస్టు
TDP Youtuber Arrest : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై, వైకాపా ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో తెదేపా కార్యకర్త, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు గార్లపాటి వెంకటేష్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించిన అధికారులను వెంకటేశ్ అడ్డుకున్నారు. నోటీసులివ్వకుండా అరెస్ట్ చేయడానికి రావడం ఏంటని ప్రశ్నించారు.
ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, ఎటువంటి ఆధారాలూ లేకుండా అరెస్ట్ చేయడానికి రావడం ఏంటని వారిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటుచేసుకుంది. వెంకటేశ్ న్యూస్ 25 అనే యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడని.. అందుకే తీసుకెళ్తున్నట్లు చెప్పారని వెంకటేష్ తల్లిదండ్రులు వివరించారు. తమ కొడుకును ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండని ఎంత ప్రాధేయపడినా.. చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్, ఇంట్లో వాళ్ల సెల్ ఫోన్లు అన్ని తీసుకెళ్లారని తల్లిదండ్రులు తెలిపారు. వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు గుంటూరు తరలించి విచారణ చేస్తున్నట్లు సమాచారం.
థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ రెడ్డి :ధరణికోట గ్రామవాసి, తెదేపా కార్యకర్త, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు వెంకటేష్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేయడాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. జగన్ రెడ్డి ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి అడ్డదారులు తొక్కుతున్నవారంతా.. మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మీడియాని చూస్తే భయం, సోషల్ మీడియా అంటే వణుకు, చివరికి యూట్యూబ్ ఛానెల్ థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ రెడ్డి సింగిల్‌గా వచ్చే.. సింహంగా చెప్పుకోవడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. ఈ మాదిరి పిరికోడు తన వెంట్రుక పీకలేరంటూ పిల్లల ముందు బిల్డప్ ఎందుకని మండిపడ్డారు. కనీసం ఐడెంటిటీ లేకుండా అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకడం, గునపాలతో తలుపులు పగలగొట్టిన కొంతమంది పోలీసులు వైకాపా గూండాలను మించిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనపడకుండా ఉండటానికి లైట్లు పగలగొట్టినా వారి మొఖాలన్నీ స్పష్టంగా వీడియోలో రికార్డ్ అయ్యాయంటూ ఘటనకు సంబంధించిన ఓ వీడియో లోకేశ్ ట్విట్టర్లో విడుదల చేశారు.