ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా టమాటా సాగయ్యే చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతాలైన మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లోని పలువురు రైతుల దయనీయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పెట్టుబడులకు ఏటా పఎకరాకు రూ.2 లక్షల నుంచి రూ.2.50లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. తీరా పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధర లేక..పెట్టుబడిలో సగం కూడా రాకపోవడంతో పంటను పొలాల్లోనే వదిలేస్తున్న పరిస్థితి.
కరోనా.. లాక్‌డౌన్ల ప్రభావం కారణంగా బయటి మార్కెట్లకు ఎగుమతి పెద్దగా జరగడం లేదు. వినియోగం బాగా తగ్గిపోవడంతో ధరలు నేలచూపు చూస్తున్నాయి. తెచ్చిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతుండటం అప్పులు ఇచ్చిన వారినుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో మానసిక క్షోభతో నిస్సహాయ పరిస్థితుల్లో కొందరు సాగుదారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
పశువుల మేతగా
ప్రస్తుతమున్న టమాటా కోసి మార్కెట్‌కు తరలిస్తే అన్నదాతలకు కూలి ఖర్చులు కూడా రాని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మార్కెట్‌లోని వ్యాపారులు 4 శాతం కమీషన్ తీసుకోవాల్సి ఉన్నా 10 శాతం తీసుకుంటున్నారని రైతులు వాపోతున్నారు. పలు సమస్యల నడుమ పెద్ద సంఖ్యలో రైతులు పంటను పశువులకు వదిలేస్తున్నారు. కొందరు ట్రాక్టర్లతో దున్నిస్తున్నారు.