ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, తిరుమలలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై(tirupati rain) అగ్రకథానాయకుడు చిరంజీవి(Chiranjeevi on tirupati rain) స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు(andhra pradesh weather), వరదల కారణంగా స్థానికులు ఇబ్బందులు పడటం చూస్తుంటే తనకెంతో బాధగా ఉందని ఆయన తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం చిరు ఓ ట్వీట్ చేశారు. ‘‘గతంలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భక్తులు, స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మనసును కలచివేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం, టీటీడీలు సమష్టిగా కృషి చేసి సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పాలి. అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.
మంచులక్ష్మి స్పందన
మరోవైపు నటి మంచు లక్ష్మి సైతం తిరుపతి వరదలపై స్పందించారు. భారీ వర్షాలతో తిరుపతి, తిరుమలలో పరిస్థితులు అతలాకుతలంగా మారాయని ఆమె అన్నారు. ఇప్పట్లో తిరుపతికి వెళ్లొద్దని ప్రజలను కోరారు. తిరుపతిలో ఉన్న పరిస్థితులకు అద్దం పట్టేలా ఉన్న ఓ వీడియో, ఫొటోలను ఆమె శుక్రవారం ఉదయం ట్విటర్ వేదికగా షేర్ చేశారు. భారీ వరదల్లో చిక్కుకుని నీటిలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తి వీడియోని షేర్ చేసిన ఆమె.. ‘‘తిరుపతిలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు ఇది ఒక నిదర్శనం. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఫోన్ చేసి కనుక్కోండి. ప్రకృతి ఉగ్రరూపం దాల్చింది’’ అని పేర్కొన్నారు. అనంతరం వరద ప్రవాహానికి ఓ రహదారి కొట్టుకుపోయిందని తెలుపుతూ.. ‘‘మీకు కనుక తిరుపతి వెళ్లాలనే ఆలోచన ఉంటే.. పరిస్థితులు చక్కబడే వరకూ దయచేసి కొన్నిరోజులపాటు వాయిదా వేయండి. అక్కడ రెడ్‌అలర్ట్ జోన్ ప్రకటించారు’’ అని ఆమె అన్నారు.