ఆంధ్రప్రదేశ్‌లోని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ వ్యవహారం.. మరోసారి దుమారం రేపింది. ఓ అభ్యర్థిని బెదిరించారంటూ.. చింతమనేనని ఎన్నికల ప్రచారం మధ్యలో నుంచి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభాకర్‌పై నమోదు చేసిన సెక్షన్లకు ఆధారాల్లేవన్న న్యాయమూర్తి.. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని ఆదేశించారు. పోలీసులు అక్రమ కేసును నిరసిస్తూ ఇంటికెళ్లేది లేదని ఠాణాలో భీష్మించిన చింతమనేనిని.. పోలీసులు బలవంతంగా ఆయన ఇంటి వద్ద దించి వెళ్లారు.
ఆ రోజు నుంచి..
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. వరుస కేసులు ఎదుర్కొంటున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను.. పోలీసులు మరో కేసులో ఆరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా బి.సింగవరం సర్పంచ్ అభ్యర్థి సరస్వతి, ఆమె భర్త సాంబశివరావు ఈనెల 17న రాత్రి గ్రామంలో ప్రచారం చేస్తుండగా చింతమనేని ప్రభాకర్ అనుచరులతో కలిసి దాడి చేశారని పేదవేగి ఠాణాలో ఫిర్యాదు చేశారు. చింతమనేనిని ఏ1గా, ఆయన అనుచరుల్లో కొందరిని సహనిందింతులుగా పేర్కొంటూ పోలీసులు కేసులు నమోదు చేశారు. గురువారం మదేపల్లిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేసి.. ఏలూరు గ్రామీణ ఠాణాకు తీసుకెళ్లారు.
వైద్యపరీక్షలు..
చింతమనేనికి వైద్యపరీక్షలు నిర్వహించిన పోలీసులు.. పశ్చిమ గోదావరి జిల్లా సెషన్ జడ్జి ముందు హాజరుపరిచేందుకు ప్రయత్నించారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లకు సరైన ఆధారాల్లేవన్న న్యాయమూర్తి.. స్టేషన్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. ఫలితంగా పోలీసులు స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు.