Loan App Frauds : రుణయాప్‌లను నిర్వహిస్తున్న చైనీయులు ఈసారి పోలీసులకు దొరక్కుండా రెండు పొరుగు దేశాలకు మకాం మార్చేశారు. అక్కడ నుంచే గతంలో రుణాలు తీసుకున్నవారి వివరాలను సేకరించారు. ఇలా 4.5 లక్షల మంది వివరాలు తీసుకుని మా యాప్‌ల ద్వారా రుణాలు తీసుకోండి అంటూ రోజూ ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు.
Online Loan App Frauds : అప్పు తీసుకుని చెల్లించిన వారికి మాత్రం వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు. వాటికి స్పందించిన వారికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు నగదు బదిలీ చేస్తున్నారు. స్పందించని వారికి కూడా రూ.50 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వారి అంగీకారం లేకుండానే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇందుకోసం ఒక కార్పొరేట్ బ్యాంక్‌లో వర్చువల్ ఖాతాలను తెరిచారని, రెండు నెలల్లో వీరు కనీసం 75 వేలమందికైనా రుణాలిచ్చుంటారని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. యాప్‌ల నిర్వహణ, నగదు బదిలీ కోసం చైనీయులు ఎంచుకున్న పంథాపై కీలక ఆధారాలు లభించాయి. 3 నెలల క్రితం ఆ రెండు దేశాలకు చైనీయులు వెళ్లినట్టు సాంకేతిక ఆధారాలు లభించగా మరిన్ని సాక్ష్యాల కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. నిందితుల ఆచూకీ లభిస్తే ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసులు జారీచేయాలని నిర్ణయించారు.