చైనాలో ఒక యువతి.. ఐదేళ్లుగా ఓ ఆఫీసులో పని చేస్తోంది. అందరితో కలిసిపోయే రకం. కుళ్లు, కుతంత్రాలు వంటివి తెలియదు. స్వచ్ఛంగా నవ్వుతూ.. అందరూ తనవాళ్లుగా భావించేది. ఆమె పని చేస్తున్న ఆఫీసులో మొత్తం 70 మంది స్టాఫ్ ఉన్నారు. వీరందరితో కలివిడిగా ఉండేది. ఈ 70 మందిలో దాదాపు మూడొంతుల మంది పెళ్లిళ్లకు వెళ్లింది. అంటే.. ఆల్మోస్ట్ తాను ఆఫీసులో చేరిన తర్వాత జరిగిన అందరి పెళ్లిళ్లకీ వెళ్లింది. వన్ ఫైన్ డే.. ఈ యువతికి పెళ్లి కుదిరింది. ఎవరి జీవితంలోనైనా పెళ్లి అద్భుత ఘట్టం. ఆ రోజున తన వాళ్లు అనుకునే వారు ఆ సంతోషంలో భాగం కావాలని అందరూ కోరుకుంటారు. ఈ యువతి రెండింతలు ఎక్కువగానే కోరుకుంది.
ఆఫీసులోని ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పిలిచింది. చాలా మంది ఒక్క కార్డుపై డిపార్ట్మెంట్ పేరు రాసి.. "వెల్కమ్ ఆల్" అని మెన్షన్ చేస్తే.. ఈమె మాత్రం ప్రతి ఒక్కరికీ శుభలేఖ అందించింది. ఎవరినైనా మరిచిపోతే.. వారు ఫీలవుతారేమోనని.. గుర్తు తెచ్చుకొని మరీ.. ఆహ్వానించింది. తప్పకుండా ఫ్యామిలీతో రావాలని కోరింది. చూస్తుండగానే పెళ్లి రోజు రానే వచ్చింది. తన ఆఫీస్ మేట్స్‌కి ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలని తన వాళ్లకు స్పెషల్‌గా చెప్పింది. భర్తకు సైతం తన సహోద్యోగుల గురించి గొప్పగా చెప్పింది.
అందుకు అనుగుణంగానే.. పెళ్లి జరుగుతున్న ఫంక్షన్ హాల్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించింది. పెళ్లిలో పరిచయస్థులు, బంధువుల సంగతి ఎలా ఉన్నా.. దోస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. తాను పెళ్లిలో బిజీగా ఉండిపోతే.. తన దోస్తులను చూసుకోవడం ఇబ్బంది అవుతుందేమో అని ముందుగానే.. వారికి కావాల్సినవన్నీ సిద్ధం చేయించింది ఆ యువతి. గ్రాండ్‌గా డిజైన్ చేసిన.. 6 టేబుల్స్‌ను మిత్రుల కోసం రిజర్వ్ చేసింది. వాటిని ఎవరికీ కేటాయించొద్దని స్ట్రిక్ట్‌గా చెప్పేసింది. ఈ భారీ టేబుళ్ల పరిధిలో కంఫర్ట్‌గా ఉండే 70 కుర్చీలను ఏర్పాటు చేయించింది. ఇక, తిండీ తిప్పల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆల్ వెరైటీస్.. కావాల్సినంత కుమ్మేసేలా సప్లై చేయాలని ఆదేశించి, పెళ్లి మండపంలోకి వెళ్లిపోయింది. పెళ్లి తంతు కొనసాగుతోంది.. కొనసాగుతోంది.. కొనసాగుతూ..నే ఉంది.. చివరికి ముగిసింది!