ప్రతీ సంస్థలో ఉద్యోగికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. వాటిని రీచ్ కాలేకపోతే.. ఆయా కంపెనీ విధానాన్ని బట్టి చర్యలుంటాయి. ఇంక్రిమెంట్లలో కోత విధించడమో.. మెరిట్ పాయింట్స్ తగ్గించడమో.. లేదంటే మందలించడమో.. చేస్తారు. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కంపెనీ.. ఎక్కడా వినని డెసిషన్ తీసుకుంది. ఎంప్లాయ్ టార్గెట్ రీచ్ కాలేదంటే ఖతమే! బలవంతంగా పచ్చి కోడిగుడ్లు మింగిస్తోంది. ఈ వింత రూల్ పెట్టింది చైనాలోని ఒక కంపెనీ. "జెంగ్జౌ టెక్నాలజీ" అనే కంపెనీ అమలు చేస్తున్న ఈ శిక్ష గురించి.. బాహ్య ప్రపంచానికి తెలియడంతో.. సోషల్ మీడియా వేదికగా భారీస్థాయిలో రచ్చ సాగింది. ఈ రచ్చ కారణంగానే.. విషయం మన దాకా వచ్చింది. ఇప్పుడు మొత్తం సినిమా చూసేద్దాం.
ఈ కంపెనీలో ఓ యువకుడు ఇంటర్న్ షిప్ చేస్తున్నాడు. అతని పేరు బయటకు రాలేదు గానీ.. ఇంటి పేరు మాత్రమే ప్రచారంలోకి వచ్చింది. అతని సర్ నేమ్ "డు". ఇచ్చిన టైమ్ లోపు.. తగినన్ని ఆర్డర్లు రాబట్టకపోవడం.. విధి నిర్వహణ సరిగా లేదు అనే కారణంతో.. పచ్చి కోడి గుడ్లు మింగాలని శిక్ష విధించినట్టు అతడు స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించాడు. కానీ.. తన వల్ల కాకపోవడంతో.. తాను నిరాకరించానన్నాడు. దీంతో.. తన ఇంటర్న్ షిప్ ను ముగించి ఇంటికి వెళ్లిపోవాలని ఆదేశించారని, బలవంతంగా ఇంటర్న్ షిప్ రద్దు చేయించారని ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాదు.. రాజీనామా పత్రంలో "వ్యక్తిగత కారణాల వల్ల" స్వయంగా వెళ్లిపోతున్నట్టుగా రాయించుకున్నారని వాపోయాడు. ఇతని పోస్టుకు ఓ వీడియోను కూడా జతచేశాడు. అందులో సదరు కంపెనీ ఉద్యోగులు పచ్చికోడి గుడ్లు మింగుతున్న సన్నివేశాలు ఉన్నాయి. ఆ సమయంలో వారు వికారంగా ఇబ్బంది పడుతున్నారు.
ఇదంతా చూసిన నెటిజన్లు "జెంగ్జౌ టెక్నాలజీ" కంపెనీపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. ఉద్యోగుల చేత బలవంతంగా ఇలా చేయించడం దారుణమైన చర్య అంటూ మండిపడ్డారు. ఇది పూర్తిగా అమానవీయమని, దీనికి కారకులైన వారిని చట్ట పరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం చినికి చినికి గాలివానలా మారడంతో సదరు కంపెనీ ప్రతినిధులు స్పందించారు. కానీ.. అదంతా ఓ సాధారణ విషయంగా కొట్టి పారేయడం విశేషం. ఉద్యోగులు జాయిన్ అవుతున్నప్పుడే నిబంధనల్లో ఈ విషయం స్పష్టంగా ప్రచురించామని చెప్పడం గమనార్హం.