శీతల గాలుల ఉద్ధృతి పెరగడం వల్ల.. రాష్ట్ర ప్రజలు చలితో ఇబ్బందుల పాలవుతున్నారు. ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాల నుంచి రెండువైపులా శీతల గాలులు తెలంగాణవైపు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 4 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆగ్నేయం నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో తేమగాలుల వల్ల తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించింది.
ఈసారి చలి తీవ్రత తక్కువే
నల్గొండ, మెదక్‌లో అతితక్కువగా.. 16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. రామగుండంలో సాధారణం కన్నా.. ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం చలి తీవ్రత తక్కువగా ఉందని, జనవరి తొలి వారం నుంచి పెరిగే అవకాశముందని తెలిపింది.
కనిష్ఠ స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయే అవకాశం ఉందని జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్ తెలిపారు. ఈనెల 31, జనవరి ఒకటో తేదీల్లో 3నుంచి 9 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. జిల్లాలో 2 రోజుల కిందట 17.2 డిగ్రీలుగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు.. ఒకరోజు వ్యవధిలోనే 7.6 డిగ్రీలకు పడిపోయాయని పేర్కొన్నారు.