తెలంగాణ

telangana

ETV Bharat / city

కన్నోళ్ల కన్నీళ్లు... పట్టింపు లేని పిల్లలు! - పండటాకుల కష్టాలు

కన్నబిడ్డ... కడుపులో పడిన నాటి నుంచి.. పెరిగి పెద్ద చేసేవరకూ తల్లిదండ్రులు తాపత్రయం పడుతుంటారు. బిడ్డలకు ఎలాంటి కష్టం రాకుండా.. చూసుకునేందుకు రెక్కలు ముక్కలు చేసుకుంటారు. పెరిగి ప్రయోజకులైన పిల్లలను చూసిన తల్లిదండ్రులు.. తెగ సంబరపడిపోతుంటారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నా.. వృద్ధాప్యంలో మాత్రం వారికి కష్టాలు తప్పటం లేదు. కన్నవారిని భారంగా భావిస్తున్న కొందరు.. ఏ మాత్రం కనికరం లేకుండా నడిరోడ్డుపై పడేస్తున్నారు.

shelter less old women story
కన్నోళ్ల కన్నీళ్లు... పట్టింపు లేని పిల్లలు!

By

Published : May 26, 2020, 9:36 PM IST

కన్నోళ్ల కన్నీళ్లు... పట్టింపు లేని పిల్లలు!

సిమెంట్‌ బల్లపై పడుకున్న భర్తను చూసుకుంటూ...లేవలేక... నడవలేక... బయటకు వెళ్లే ఓపిక లేక బాధపడుతున్న ఈ వృద్ధురాలి పేరు చోటీబీ. ఏపీలోని నెల్లూరు నగరం ధనలక్ష్మీపురంలో భర్త రహంతుల్లాతో కలసి ఉండేది. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు మగపిల్లలు కాగా..ఇద్దరు అమ్మాయిలు. ఉన్నదాంట్లో హాయిగా జీవిస్తూ.. ఉన్న ఆస్తులు అమ్మి అందరికీ పెళ్లిళ్లు చేశారు. బాధ్యతలూ నెరవేర్చి వృద్ధాప్యంలో సంతోషంగా ఉండాలనుకున్న వీరి బతుకులు ప్రస్తుతం రోడ్డున పడ్డాయి. నగరంలోని పశువైద్య కేంద్రం గోడ...ఈ పండుటాకులకు నీడనిచ్చింది.

నడిరోడ్డు పై వదిలేశారు..

కుటుంబం కోసం తల్లిదండ్రులు ఇంత చేసినా కన్నబిడ్డలకు మాత్రం కనికరం లేకుండా పోయింది. 80 ఏళ్ల తండ్రి, 70ఏళ్ల తల్లిని రోడ్డుపైనే వదిలేశారు. రాత్రికి రాత్రే.. ఆటోలో తీసుకొచ్చి రోడ్డున పడేశారు. ఆస్తులు అమ్మించి... అప్పులు తీర్చుకున్న కొడుకులకు... వారిని తమ వద్దే ఉంచుకోవాలనే ఆలోచన మాత్రం రాలేదు. కొడుకులు చూస్తారని కూతుళ్లు... కూతుళ్లు చూసుకుంటారని కొడుకులు.. వంతులు వేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరి పరిస్థితి చూస్తున్న స్థానికులు అన్నం పెడుతుంటే... జీవనం సాగిస్తున్నారు.

ఉన్నదంతా ఊడ్చేశారు..

అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల కోసం ఈ వృద్ధులు.. ఉన్నదంతా ఇచ్చేశారు. చివరకు బ్యాంకులో దాచుకున్న డబ్బులను కూడా.. వీరి పిల్లలు వాడేసుకున్నారు. తాము సంపాదించింది... తమదైనా.. పిల్లలదైనా ఒకటే కదా అనుకున్నారీ వృద్ధులు. ప్రస్తుతానికి .. పట్టెడన్నం పెట్టే నాథుడి కోసం ఎదురు చూస్తూ నానాపాట్లూ పడుతున్నారు.

ఏడు పదులు నిండిన వృద్ధ దంపతులు పరిస్థితి చూసిన వారంతా అయ్యో పాపం అంటున్నా కన్నబిడ్డలకు మాత్రం కనికరం లేకుండా పోయింది. ఎండలో ఎండుతూ..రాత్రిపూట దోమలతో సహవాసం చేస్తున్న వీరికి.. మనసున్న వారు ఆహారం అందిస్తున్నారు. ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు, అనాథ ఆశ్రమ నిర్వాహకులు.. వీరిని చేరదీయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!

ABOUT THE AUTHOR

...view details