తెలంగాణ

telangana

ETV Bharat / city

Agriculture : సేద్యంలో తండ్రిని గెలిపించే బాధ్యత పిల్లలదే - children should help father in crop cultivation

పంటల సాగు డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లి.. రైతులకు సులభ మార్గాలు కల్పిస్తోంది. విత్తనాలు వేసే దగ్గరి నుంచి పంట అమ్మే వరకు అవసరమైన సమస్త సమాచారాన్ని స్మార్ట్​ఫోన్ అందిస్తోంది. ఎన్నో రకాల యాప్​లు అన్నదాతకు దన్నుగా నిలుస్తున్నాయి. స్మార్ట్​ఫోన్​పై అవగాహన లేకపోవడం వల్ల చాలా వరకు రైతులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. పంట పండించడానికి రైతు పడే కష్టాన్ని కళ్లారా చూస్తోన్న వారి పిల్లలు ఓ అడుగు ముందుకేసి వారికి స్మార్ట్​ఫోన్ వాడకం, వ్యవసాయ సంబంధ యాప్​లపై అవగాహన కల్పిస్తే రైతులు అద్భుతాలు సృష్టిస్తారని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Smartphone use in agriculture
సేద్యంలో స్మార్ట్​ఫోన్ వినియోగం

By

Published : Jul 6, 2021, 7:15 AM IST

పంటల సాగు క్రమంగా డిజిటల్‌ ప్రపంచంలోకి వెళుతోంది. మొబైల్‌ యాప్‌లు, వాట్సాప్‌ గ్రూప్‌లు వ్యవసాయ సమాచార స్రవంతిగా నిలుస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. పొలంలో విత్తనాలు వేసే దగ్గరి నుంచి మార్కెట్‌లో పంటలు అమ్మే వరకూ అవసరమైన సమస్త సమాచారం లభ్యమవుతోంది. జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యవసాయ ఉత్పత్తులు తయారుచేసే కంపెనీలు ప్రత్యేకంగా యాప్‌లను నిర్వహిస్తున్నాయి. వాట్సాప్‌లో ప్రతీ పంట సాగుచేసే రైతులతో ప్రత్యేకంగా గ్రూప్‌లను ఏర్పాటుచేస్తున్నారు. ఈ గ్రూప్‌లను పలు కంపెనీలతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, విత్తన కంపెనీలు, రిటైర్డ్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు నిర్వహిస్తున్నందున శాస్త్రీయ సమాచారం లభిస్తోంది.

మూడు యాప్‌లు అందుబాటులో ఉన్నా..

ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చే తాజా సమాచారాన్ని అతి తక్కువమంది వినియోగించుకుంటున్నారని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతీ రైతుకు అందుబాటులోకి రావాలని కేంద్ర ప్రభుత్వం స్వయంగా మూడు మొబైల్‌ యాప్‌లను తెచ్చింది. కిసాన్‌ సువిధ, పూసా ఎంకృషి, ఏజీ మార్కెట్‌ పేరుతో వాటిని తేగా వినియోగం చాలాతక్కువగా ఉంది.

కిసాన్‌ సువిధ యాప్‌ను బిహార్‌లో 98,707 మంది డౌన్‌లోడ్‌ చేసుకుంటే ఏపీలో 37,896 మంది, తెలంగాణలో 47,038 మందే వాడుతున్నారని కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది. దేశవ్యాప్త వ్యవసాయ మార్కెట్లలో పంటల ధరల సమాచారాన్ని అందించే ఏజీమార్కెట్‌ యాప్‌ను ఏపీలో 3,536 మంది, తెలంగాణలో 1,976 మంది రైతులే డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.

తండ్రి కష్టం తెలిసిన పిల్లలే కదలాలి

యాప్‌లు, ఇతర సమాచార వినియోగం తక్కువగా ఉండడానికి కారణాలపై పలువురు రైతులు, వ్యవసాయాధికారులతో మాట్లాడినప్పుడు స్మార్ట్‌ఫోన్ల వాడకంపై చాలామంది రైతులకు అవగాహన లేదని తెలిపారు. వారి పిల్లలు తలుచుకుంటే తండ్రిని సేద్యంలో తప్పక గెలిపించగలరని అధికారులు నిశ్చిత అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఊహ తెలిసినప్పటి నుంచి వ్యవసాయంలో తండ్రి పడుతున్న కష్టం పిల్లలకు తెలియంది కాదు. ఇప్పుడు ఆ పిల్లలు చదువు బాటలో ముందుకెళ్తూ సెల్‌ఫోన్‌ కూడా వాడుతూ ఉంటారు. కుమారుడు కావొచ్చు, కుమార్తె కావొచ్చు సాగులో విశేష అనుభవం ఉన్న నాన్నకు నేను అండగా నిలవాలి అని ప్రతి రైతు సంతానం స్థిరంగా సంకల్పిస్తే ఫలితాలు అమోఘంగా ఉంటాయి. వారు తగిన యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొని, అలాగే ఆయా పంటలకు సంబంధించిన వాట్సాప్‌ గ్రూప్‌లలో చేరి అక్కడ లభ్యమయ్యే సమాచారాన్ని తండ్రికి వివరించి చెప్పొచ్చు. సమాచార కచ్చితత్వాన్ని నిర్ధారించుకోడానికి అందుబాటులో ఉండే వ్యవసాయ విస్తరణ అధికారులను నేరుగా కలవొచ్చు. లేదా ఫోన్‌లో సంప్రదించవచ్చు’’ అని వివరిస్తున్నారు. ‘‘యాప్‌లలో సమాచారం ఇంగ్లిషులో ఉంటున్నా ఇప్పటి పిల్లలకు ఆ మాత్రం అర్థం చేసుకోలేని పరిస్థితేమీ ఉండదు. కావాల్సిందల్లా నీకు నేనున్నా నాన్న... అందివచ్చిన సాంకేతికతను, సమాచారాన్ని వినియోగించుకొని మనం వ్యవసాయాన్ని పండగ చేద్దాం అని భరోసాగా చెప్పగలగడం ముఖ్యం’’ అని అధికారులు పేర్కొంటున్నారు.

ఏమిటీ ఉపయోగం..

యాప్‌ల వల్ల రైతులకు శాస్త్రీయ సమాచారం సులభంగా అందుతుంది. ఉదాహరణకు మొక్కలపై ఏదైనా తెగులు కనిపిసిస్తే దానిని సెల్‌ఫోన్‌తో ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు. ఆ తెగులును ఆన్‌లైన్‌లోనే విశ్లేషించి దాని లక్షణాలు, ప్రభావాన్ని వివరించి దాన్ని తగ్గించేందుకు ఏ రసాయన మందు ఎంత మోతాదులో చల్లాలనే సమాచారం రైతు ఫోన్‌కు వస్తుంది. ఇలాగే విత్తనాలు, ఎరువులు ఎంత వేయాలి, వారి ప్రాంతంలో వాతావరణ సమాచారం, పంటల ధరలు ఏయే మార్కెట్‌లో ఎంత ఉన్నాయనే వివరాలు సైతం యాప్‌లు అందిస్తున్నాయని రాజేంద్రనగర్‌లోని జాతీయ వ్యవసాయ విస్తరణ, నిర్వహణ సంస్థ(మేనేజ్‌) డైరెక్టర్‌ జనరల్‌ చంద్రశేఖర్​ చెప్పారు.

ఏ యాప్‌లో ఏముంటుందంటే..

కిసాన్‌ సువిధ: ఈ యాప్‌లో రాబోయే 5 రోజుల వాతావరణ సమాచారం, ఎరువులు, పురుగు మందుల డీలర్ల వివరాలు, వ్యవసాయ సలహాలు, సస్యరక్షణ, రసాయన పురుగుమందుల వాడకం తదితర అనేక వివరాలు ఉంటాయి.

పూసా ఎంకృషి: దేశవ్యాప్తంగా కొత్త వంగడాల సమాచారం, అధునాతన యంత్రాలు తదితర వివరాలుంటాయి.

ఏజీ మార్కెట్‌:దేశ వ్యాప్తంగా మార్కెట్‌లలో వివిధ పంటలకు లభిస్తున్న ధరలు ఆన్‌లైన్‌లో చూడొచ్చు. పంటలబీమా, ఉద్యానపంటలు, కోళ్లపరిశ్రమ, పశుపోషణ్‌ తదితర అనేక యాప్‌లు గూగుల్‌ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని రైతులు వినియోగించుకోవచ్చని కేంద్ర వ్యవసాయశాఖ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details