‘‘కల్తీ విత్తనాల తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలి. ఎంతటి వారినైనా పీడీ చట్టం కింద అరెస్టు చేయండి. చిత్తశుద్ధితో పనిచేసి నకిలీ విత్తన విక్రయ ముఠాలను పట్టుకునే పోలీసు, వ్యవసాయశాఖల అధికారులను గుర్తిస్తాం. వారికి యాక్సిలరీ ప్రమోషన్లు, రాయితీలు, సేవా పతకాలను ప్రభుత్వం అందిస్తుంది. ఇందుకోసం తక్షణం పోలీసులను రంగంలోకి దించాలి - కేసీఆర్, ముఖ్యమంత్రి.
డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసి...
‘ఇక మీరు నరసింహావతారం ఎత్తాలె. దొరికినోళ్లను దొరికినట్టే పట్టుకుని పీడీ చట్టం కింద కేసులు పెట్టాలె. తెలంగాణలో కల్తీ విత్తనాలు అమ్మలేమురా అనేలా మీ చర్యలుండాలె. వారు తప్పించుకోకుండా డేగకన్నుతో చక్రవ్యూహం పన్నాలె. నకిలీ విత్తనాలే కాదు.. ఎరువులు, జీవన పురుగుమందుల పేరుతో రైతులను మోసం చేసే ముఠాలనూ వదలకండి’’ అని చెప్పారు.
ఈ ముఠాలను కనిపెట్టాలని ఇంటెలిజెన్స్ ఐజీని ఆదేశించారు. వెంటనే డీజీపీ కూడా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి ఇదే విషయాన్ని గట్టిగా చెప్పారు. నకిలీపై తక్షణం రంగంలోకి దిగాలన్నారు. కల్తీని నివారించేందుకు కఠిన నిబంధనలతో చట్ట సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు.
మొత్తం ధాన్యం కొనాలని కేంద్రాన్ని కోరతాం..
ధాన్యం కొనుగోలుకు ఎంతో ధైర్యం కావాలి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ చేయని సాహసం తెలంగాణ చేసింది. కరోనా సమయంలో లారీలు, డ్రైవర్లు, హమాలీలు...అన్నీ కొరతే. అయినా వాటిని అధిగమిస్తూ ఇప్పటికే 87 శాతం ధాన్యాన్ని కొన్నాం. మిగిలినవి నాలుగైదు రోజుల్లో కొనేస్తాం. భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)తో మాట్లాడి ఎంత ధాన్యం వచ్చినా తప్పకుండా ప్రభుత్వం కొంటుంది. రైతులు భయాందోళనలకు గురికావద్దు. ఆగమాగం కావద్దు. మొత్తం ధాన్యాన్ని కొనాల్సిందిగా కేంద్రాన్ని కోరతాం. పంజాబ్‌లో వందశాతం కొంటున్న ఎఫ్‌సీఐ తెలంగాణలో అలా కొనకపోవడమేమిటి? కేంద్రం ఇలా వివక్ష చూపడం సరికాదు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తాం.
జీఎస్టీకి వ్యవసాయ రంగం నుంచి 17 శాతం ఆదాయం..
గత సంవత్సరం కరోనా సమయంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే తెలంగాణ జీఎస్టీకి వ్యవసాయ రంగం 17 శాతం ఆదాయాన్నిచ్చింది. ఇంకా పరోక్షంగా రాష్ట్ర ఆదాయానికి వ్యవసాయ రంగం ఆదరువుగా మారే పరిస్థితికి చేరుకుంది. ధాన్యం దిగుబడిలో తెలంగాణది మొదటి స్థానం. భవిష్యత్తులో మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మరికొన్ని ఎత్తిపోతలు పూర్తయితే వ్యవసాయ రంగం వందశాతం స్థిరీకరణ జరుగుతుంది. మరో వారంలో రుతుపవనాలు వస్తున్నందున విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి. వ్యవసాయశాఖలో ఉన్నతాధికారులను నియమించుకోవాలి. విత్తనాలు, ఎరువులకు ఒకరిని; మార్కెట్ పరిశోధన, విశ్లేషణ విభాగం కోసం మరో అదనపు సంచాలకుడిని నియమించుకోవడానికి ప్రతిపాదనలు పంపాలి. అలాగే ధాన్యాన్ని నిల్వ చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం. ప్రస్తుతం 25 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యముంది. కొత్తగా 40 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యమున్న గోదాముల నిర్మాణానికి మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
వెదజల్లే పద్ధతితో రూ.10 వేల కోట్ల ఆదా
వరి సాగు వ్యయం తగ్గించడానికి వెదజల్లే పద్ధతిని పాటించాలి. కోటి ఎకరాల వరి సాగుకు ఈ పద్ధతి పాటిస్తే రూ.10 వేల కోట్ల వరకూ సాగు వ్యయాన్ని ఆదా చేయవచ్చు. దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. ఖమ్మం జిల్లాలో ఈ విధానంలో వరి సాగు చేసిన రైతులతో మాట్లాడా. స్వయంగా రైతును కాబట్టి నా పొలంలో ఈ విధానంలో వరి సాగుచేసి మంచి ఫలితాలను పొందా. రైతులందరూ వెదజల్లే పద్ధతి అనుసరిస్తే మంచిది’’ అని సీఎం కేసీఆర్ సూచించారు. సమీక్షలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, బి.కృష్ణమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయాధికారులే నేరం చేస్తే ఉద్యోగం నుంచి డిస్మిస్.. ఐదేళ్ల జైలు
కల్తీ విత్తన ముఠాలతో ఒకవేళ వ్యవసాయాధికారులే జట్టు కట్టినట్లు రుజువైతే ఏమాత్రం ఉపేక్షించవద్దని సీఎం స్పష్టం చేశారు. ‘‘అలాంటివారిని తక్షణం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయండి. ఐదేళ్ల జైలుశిక్ష పడేలా చూడండి. వ్యవసాయశాఖ అధికారులు అలసత్వం వీడాలి. ప్రేక్షకపాత్ర వహించకుండా కల్తీలను నియంత్రించాలి. దీనికి జిల్లా వ్యవసాయాధికారి, సహాయ సంచాలకులు బాధ్యత వహించాలి. కలెక్టర్లు, ఎస్పీలు దీనిపై సమీక్షలు నిర్వహించాలి. నాణ్యమైన విత్తనాలను గుర్తించేందుకు క్యూ ఆర్ కోడ్ విధానాన్ని అమలుచేయాలి. ఫోన్‌తో విత్తన ప్యాకెట్‌పై ఉండే ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే తయారీ కంపెనీ, తదితర వివరాలన్నీ తెలుస్తాయి. ప్రభుత్వం ఆమోదించిన కంపెనీలే విత్తనాలను విక్రయించేలా చూడాలి.
ఇవీ చూడండి:paddy procurement: పంటను అమ్ముకోవడానికి అన్నదాతల హరిగోసలు